‘కోదండ రాం మాకు ప్రత్యర్థి కాదు’ | Sakshi
Sakshi News home page

‘కోదండ రాం మాకు ప్రత్యర్థి కాదు’

Published Tue, Feb 6 2018 5:27 PM

Kodada Ram is not a rival to us - Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం మాకు ప్రత్యర్థి కాదని, అలాగే ఆయన కాంగ్రెస్ ఏజెంట్ కాదని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ కుంతియా స్పష్టం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణాలో టీఆర్‌ఎస్‌తో పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని..పొత్తులకు చాలా సమయం ఉందని వ్యాఖ్యానించారు. వాటి గురించి పీసీసీ చీఫ్‌ స్పందిస్తారని తెలిపారు. కోదండరాం గొప్ప వ్యక్తి అని, ఆయన అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర ఎంతో కీలకం అని వ్యాఖ్యానించారు.

 గుజరాత్ మాదిరి అన్ని వర్గాలను కలుపుకుని వెళతామని, టీఆర్‌ఎస్ ఓడిపోతుందనే విధంగా కేటీఆర్ కామెంట్స్ ఉన్నాయంటూ పరోక్షంగా చురకలు అంటించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని, దీనికి కోసం చాలా మందితో ఉత్తమ్ మాట్లాడుతున్నారని తెలిపారు. కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలిసి రావాలని, త్వరలో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాదయాత్రలు చేస్తామని, జూన్2న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు. ఈ వారం టీఆర్‌ఎస్, టీడీపీ నుంచి పలువురు ముఖ్యులు కాంగ్రెస్‌లో చేరతారని, బీజేపీ నేత నాగం జనార్దన్‌ రెడ్డిని వద్దని పార్టీలో ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. 

స్థానిక నేతలతో మాట్లాడిన తర్వాతనే ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నామని, ప్రవాస గల్ఫ్ ఎన్నారైలకు కాంగ్రెస్ భరోసా కల్పిస్తుందని వివరించారు. ఈ నెల 12 నుంచి కాంగ్రెస్ బృందం కువైట్‌లో పర్యటిస్తుందని, గల్ఫ్‌లో క్షమాబిక్ష (ఆమ్నెస్టీ )పథకంలో..ముప్పై వేల మంది భారతీయ కార్మికులు దేశానికి రావడానికి ఎదురుచూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని, ఆ కార్మికులకు ఫ్రీ టికెట్ లు అందించాలని కోరారు. గల్ఫ్ ఎన్నారైల భాదలు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడటం లేదన్నారు. కువైట్‌కు ప్రత్యేక అధికార బృందాన్ని పంపించి..ఎన్నారై పాలసీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement