‘మధ్యంతరం’ ఎందుకు? | Sakshi
Sakshi News home page

‘మధ్యంతరం’ ఎందుకు?

Published Wed, Jun 27 2018 2:17 AM

Kodandaram challenge to CM KCR - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ప్రజలు ఐదేళ్లు పాలించాలని అధికారం కట్టబెడితే మధ్యలో ఎన్నికలకు వెళ్లేందుకు ఎందుకు సిద్ధమవుతున్నారో ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్‌కు టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. మంగళవారం కరీంనగర్‌లో 17 జిల్లాల సమన్వయ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్రమార్గంలో మధ్యలో ఎన్నికలకు వెళ్లడమంటే పరిపాలన చేతకాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని చెప్పారు. పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు.. అంతర్గతంగా బలహీనపడినప్పుడు మాత్రమే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

అలాంటి పరిస్థితులు ఏమీ లేకపోయినా టీఆర్‌ఎస్‌ ముందస్తుకు వెళ్లడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. పాలన చేయడం చేతకాకపోతే దిగిపోవాలేగానీ, ముందస్తు అంటూ ప్రజలను మోసం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రపంచాన్ని తలకిందులుగా చూడవద్దని, కాళ్ల మీద నిలబడి చూడాలని హితవు పలికారు. రైతుబంధు పథకంలో లోపాలు ఉన్నాయని, ఎక్కువ భూమి ఉన్నవారికే ప్రయోజనం కలిగేలా పథకం అమలు జరుగుతోందన్నారు. వ్యవసాయం చేయని సంపన్నులకు, పడావు భూములకు వర్తించేలా పథకం ఉందని, సీలింగ్‌ పెట్టి ఐదు నుంచి ఆరెకరాలు ఉన్న వారికి మాత్రమే రైతుబంధు అందజేయాలని  డిమాండ్‌ చేశారు. భూరికార్డుల ప్రక్షాళనలోనూ లోపాలు ఉన్నాయని వాటిని సవరించాలని సూచించారు.    

Advertisement

తప్పక చదవండి

Advertisement