‘నిరంకుశ పాలనకు గోరికట్టి.. కూటమికి పట్టంకట్టండి’ | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 4 2018 4:24 PM

Kodandaram Comments On TRS About Revanth Reddy Arrest - Sakshi

సాక్షి, వరంగల్‌ అర్బన్‌ : టీఆర్‌ఎస్‌ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని ముందే గవర్నర్‌కు చెప్పామని నిరంకుశ పాలనకు గోరికట్టి.. ప్రజాకూటమికి పట్టంకట్టండని తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. హన్మకొండలోని టీజెఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌కు సంబంధించి పైవిధంగా అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. అర్ధరాత్రి తలుపు పగులగొట్టి అరెస్ట్‌ చేయడం దుర్మార్గమన్నారు. ప్రజాకూటమి అభ్యర్థులపై కావాలనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. అధికార పార్టీకి కొమ్ముకాయకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు. రేవంత్‌ రెడ్డి ఇంటిపై అర్థరాత్రి దాడి చేసి అరెస్ట్‌చేయడం ఆర్టికల్‌ 21ను ఉల్లంఘించడేమనన్నారు. రాత్రి జరిగిన అరెస్ట్‌లు టీఆరెఎస్‌ అసహనానికి నిదర్శనమన్నారు. ప్రశ్నించే, నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికి ఉంటుందన్నారు. గజ్వేల్‌లో ఒంటేరు ప్రతాప్‌రెడ్డి విషయంలో కూడా ఇదే తతంగం చేశారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ వ్యవహారంపై తాము ముందే ఎన్నికల సంఘానికి తెలియజేశామన్నారు. రాష్ట్రంలో బయోత్పాతం ముందే ఊహించామని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపామన్నారు. ఇప్పుడు అదే జరుగుతోందని తెలిపారు. 

ఎమెర్జెన్సీలో లేని ఉల్లంఘనలు ఇప్పుడు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధైర్యంగా తిరుగుబాటు చేయాలని, వరంగల్‌ పశ్చిమ, వర్దన్న పేట ప్రజాకూటమి అభ్యర్థులు రేవూరి ప్రకాష్‌ రెడ్డి, దేవయ్యలకు మద్ధతుగా ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. విద్య, వైద్యం, ఉపాధిపై ఉమ్మడి మేనిఫెస్టో తయారుచేశామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో ప్రజల అభివృద్ధి కనపడటం లేదని ఎద్దేవాచేశారు. కౌలు రైతులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివక్ష చూపిందని.. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రజా కూటమి చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులను సమీక్షిస్తామన్నారు. రాజకీయ నాయకులు చెప్పేవి బోగస్‌ సర్వేలు అని రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 


 

Advertisement

తప్పక చదవండి

Advertisement