రాష్ట్రంలో ప్రగతి ఆవేదన: కోదండరామ్‌ | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ప్రగతి ఆవేదన: కోదండరామ్‌

Published Sat, Sep 1 2018 3:33 AM

kodndaram commented over trs meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజలకు ప్రగతిపై ఆవేదనే మిగిలిందని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. టీజేఎస్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసినా అనేక జిల్లాల్లో అభివృద్ధి జాడేలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆ కుటుంబానికే పరిమితమైందన్నారు. ప్రభుత్వం ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒకరిద్దరు కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తోందని ఆరోపించారు. దళితుడు సీఎం అవుతారనుకున్నా జరగలేదన్నారు.

వ్యవసాయ అప్పుల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, రైతుల ఆత్మహత్యల్లో మూడోస్థానంలో ఉందని పేర్కొన్నారు.  రాష్ట్రంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ప్రభుత్వం 1.07 లక్షల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయని చెప్పిందన్నారు. మిషన్‌ కాకతీయలో 18,656 చెరువులు తీసుకుంటే 25 శాతమే పూర్తి అయ్యాయని చెప్పారు. ఆగస్టు 15 నాటికి గ్రామాలకు తాగునీరు ఇస్తామని చెప్పిన మిషన్‌ భగీరథ పూర్తి కాలేదన్నారు. సభకు వచ్చే వారు వీటిపై నిలదీయాలని పిలుపునిచ్చారు.

టీజేఎస్‌ అభ్యర్థులు సిద్ధం
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని కోదండరాం అన్నారు. దశలవారీగా పార్టీని పటిష్టం చేస్తున్నామన్నారు. ప్రతి 25 నియోజకవర్గాలను ఎంచుకొని గ్రామస్థాయి, బూత్‌ స్థాయి వరకు పటిష్టతకు చర్యలు చేపడుతున్నామన్నారు. 15 రోజుల్లో ఈ పని చేస్తామన్నారు.  

Advertisement
Advertisement