కచ్చితంగా 100 స్థానాల్లో గెలిచి తీరతాం: కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

కచ్చితంగా 100 స్థానాల్లో గెలిచి తీరతాం: కేటీఆర్‌

Published Sun, Oct 14 2018 1:56 AM

KTR Confidence Over TRS Victory In Assembly Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విపక్ష కూటమి ఎన్ని కుట్రలు పన్నినా.. 100 సీట్లతో తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం పనితీరును ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ కాసేపు మాట్లాడారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాకోర్టే అంతిమమని.. ప్రభుత్వం పనితీరును అక్కడే తేల్చుకుంటామని కేటీఆర్‌ చెప్పారు. రాహుల్‌ గాంధీ ఎక్కడ ప్రచారం చేసినా.. కాంగ్రెస్‌ పని ఖతమేనని ఎద్దేవా చేశారు. ‘సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతి. పేదలతో ఆయనకు భావోద్వేగ బంధం కుదిరింది. ఏపీ సీఎం చంద్రబాబు లాగా ఎన్నికలు వస్తున్నాయంటే.. తూతూమంత్రంగా పథకాలను అమలు చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదు. మొదటి కేబినెట్‌ భేటీలోనే ఏకంగా 42 అంశాలపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం  తీసుకున్నారు. ఈ అంశాలే.. సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో అచంచలమైన విశ్వాసాన్ని పెంచాయి’అని కేటీఆర్‌ తెలిపారు. అన్ని పనులు ముఖ్యమంత్రే చేయాలనేది కరెక్టు కాదని.. పథకాల అమలు బాధ్యత అధికార యంత్రాంగానిదేనన్నారు. ‘కేసీఆర్‌ గురించి అందరికీ అన్నీ తెలుసు. 17 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఆయన్ను గమనిస్తున్నారు. కేసీఆర్‌ భాష, అలవాట్లు, ఆరోగ్యం వంటి వాటిపై ఎంత దుష్ప్రచారం చేసినా.. ఆయనే సీఎంగా ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. ఇప్పుడూ అదే జరుగుతుంది’అని ఆయన ధీమాగా చెప్పారు. 

కూటమి లెక్కలు కుదరవు 
‘రాజకీయాల్లో ఒకటి, ఒకటి కలిస్తే రెండు కాదు. ఇదే రూల్‌.. మహాకూటమికి కూడా వర్తిస్తుంది. 2009లో కూటమి అంచనాలు తప్పింది. అప్పుడు టీడీపీతో పొత్తు విషయంలో కేసీఆర్‌ విముఖత చూపారు. మేమే ఒప్పించి పొత్తు పెట్టుకోవాలని సూచించాం. అయితే కూటమి దారుణంగా విఫలం చెందింది. పైస్థాయిలో పొత్తులు పెట్టుకుంటే కింది స్థాయిలో నేతలు, కార్యకర్తలు కలిసి పని చేయలేరు. 2009లో రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగలేదు. ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. మా పార్టీ కేవలం 10 సీట్లకు పరిమితమైంది’అని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఆవిర్భావం నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న టీడీపీ.. ఇప్పుడు ఆ పార్టీతో కలిసి పోటీ చేయడం క్షేత్రస్థాయిలో బెడిసికొడుతుందన్నారు. ‘కూటమిలో సీట్ల పంచాయితీ తెగేట్టులేదు. నర్సంపేట వంటి చోట్ల.. ఏ పార్టీ బరిలో ఉండాలనేది సమస్యగా మారింది. కోదండరాం 2014 ఎన్నికల నుంచే కాంగ్రెస్‌ లైన్‌లో ఉన్నారు. సోనియాగాంధీని రహస్యంగా కలిసి ఇద్దరు, ముగ్గురికి టిక్కెట్‌ ఇప్పించుకున్నారు’అని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను దించాలనే ఏకైక ప్రచారాంశంతో విపక్షాలు ముందుకెళ్తున్నాయని.. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా ఉండదన్నారు. ‘కాంగ్రెస్‌లో విశ్వసనీయత ఉన్న నేతలు లేరు. వాళ్ల హామీలను ప్రజలు నమ్మడం లేదు. గత ఎన్నికల సమయంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామని టీఆర్‌ఎస్‌ చెప్పింది. రాహుల్‌ గాంధీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ప్రజలు టీఆర్‌ఎస్‌నే దీవించారు’అని కేటీఆర్‌ చెప్పారు. 

కొంతైనా అసంతృప్తి తప్పదు! 
‘పనితీరు విషయంలో ప్రతి ఎమ్మెల్యేపైనా ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. మన ఇంట్లోనే అందరూ మన విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉండరు. కాంగ్రెస్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి భార్య (పరోక్షంగా దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డిని ప్రస్తావిస్తూ) సైతం వాళ్ల మేనిఫెస్టోపై సంతృప్తిగా లేరు. అభివృద్ధి, సంక్షేమం, సామూహిక పనుల విషయంలో ఎంత చేసినా.. వ్యక్తిగత పనుల విషయంలో కొందరికి అసంతృప్తి ఉంటుంది. ఆశించినవి జరగలేదనే అసంతృప్తి వేరు. కానీ.. ఎన్నికల విషయంలో మాత్రం ప్రజలు.. ఇప్పటిదాకా జరిగిన పనినే చూస్తారు. రాష్ట్రంలో ఎటు చూసినా టీఆర్‌ఎస్‌ గాలి వీస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల పరంగా చూస్తే.. 60 సీట్లతో గెలవడంలో సంతృప్తి లేదు’అని మంత్రి వ్యాఖ్యానించారు. 

చంద్రబాబుకు ఉలికిపాటెందుకు? 
‘కాంగ్రెస్‌ను ముందుపెట్టి తెలంగాణలో పెత్తనం చెలాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగాక చంద్రబాబుకు ఇంకా ఇక్కడేం పని. ఈ విషయంలో వైఎస్‌ జగన్, పవన్‌ కల్యాణ్‌ స్పష్టంగా ఉన్నారు. చంద్రబాబు మాత్రం అప్పుడు ఎమ్మెల్యేకు కోటి రూపాయలు ఇచ్చి మా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రయత్నించాడు. ఇప్పుడు వంద కోట్లు పెట్టి కాంగ్రెస్‌లో ఉన్న తోలుబొమ్మలను ఆడించాలనుకుంటున్నాడు. వెన్నెముకలేని కాంగ్రెస్‌.. చంద్రబాబు చెప్పినట్లు చేసేందుకు సిద్ధమైంది. చంద్రబాబు విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏపీకి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ)ని తెస్తానని చెప్పి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ (ఐటీ)దాడులను తెచ్చారు. ఈ దాడుల విషయంలో చంద్రబాబు ఎందుకు ఉలికిపడుతున్నారు. వ్యాపారవేత్తలైన సీఎం రమేశ్, నారాయణ ఆస్తులపై జరిగిన దాడుల విషయంలోనూ రాద్ధాంతం చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల హామీల విషయంలో చంద్రబాబు వైఖరిని అందరూ పరిశీలించాలి’అని కేటీఆర్‌ అన్నారు. 

అత్యుత్తమ మేనిఫెస్టో... 
టీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే స్ఫూర్తితో ఎన్నికల మేనిఫెస్టో అద్భు తంగా ఉంటుంది. ఆసరా పింఛన్ల పెంపు కూడా జాబితాలో ఉంది. దసరా తర్వాతే మేనిఫెస్టో వెల్లడిస్తాం. మా ప్రభుత్వం రుణమాఫీని విజయవంతంగా అమలు చేసింది. రూ. 2 లక్షల పంట రుణాలు ఉన్న రైతుల సంఖ్య తెలంగాణ వ్యాప్తంగా 1–2% మాత్రమే. నాలుగేళ్ల పాలనపై ఆడియో, వీడియో ప్రచార ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే విషయంలో నేనేమీ నిర్ణయించుకోలేదు. కొన్ని నియోజకవర్గాలకు వెళ్లొస్తున్నా.. దసరా తర్వాత సీఎం కేసీఆర్‌ పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహిస్తారు’ అని ఆయన పేర్కొన్నారు.  

బీజేపీకి ఒక్క సీటు రాదు 
‘తెలంగాణ కోసం బీజేపీ ఒక్క మేలూ చేయలేదు. బయ్యారం, ఐటీఐఆర్, హైకోర్టు విభ జన విషయాలను పట్టించుకోలేదు. మిషన్‌ భగీరథకు, మిషన్‌ కాకతీయకు కలిపి రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ ప్రతిపాదించింది. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నాలుగేళ్లలో బీజేపీ పేదల కోసం ఒక్క పథకం, కార్యక్రమం చేపట్టలేదు. నోట్ల రద్దుతో అమలుతోనూ పెద్దగా ఏమీ జరగలేదు. పైగా మహిళల పోపుల పెట్టెలోని డబ్బులను తీసుకునేలా చేసింది. తెలంగాణలో కులం, మతంతో నిమిత్తం లేకుండా ప్రజలు తీర్పు ఇస్తారు. బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. వారి స్థానాల్లో మా అభ్యర్థులు బలంగా ఉన్నారు’ అని కేటీఆర్‌ అన్నారు. 

Advertisement
Advertisement