ఎదురుదెబ్బ కాదు.. స్పీడ్‌ బ్రేకరే | Sakshi
Sakshi News home page

ఎదురుదెబ్బ కాదు.. స్పీడ్‌ బ్రేకరే

Published Wed, May 29 2019 1:43 AM

KTR Respond On Telangana Lok Sabha Election Results 2019 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ కాదని, వాటిని తాత్కాలిక స్పీడ్‌బ్రేకర్‌గా భావిస్తున్నామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 40 శాతం ఓట్లు, మెజారిటీ సీట్లు వచ్చాయని తెలిపారు. దేశవ్యాప్తంగా మోదీ మళ్లీ ప్రధాని కావాలనే భావన ఏర్పడిందని, బీజేపీకి కార్యకర్తలు లేనిచోట్ల కూడా ఆ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయన్నారు. లోక్‌సభ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని, గెలుపోటములకు ఒక్కోచోట ఒక్కో కారణం కనిపిస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 4.5 లక్షల ఓట్లు తగ్గాయని తెలిపారు. అయితే వరంగల్‌ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్‌కు వచ్చిన మెజారిటీ కాంగ్రెస్, బీజేపీలు గెలిచిన ఏడు స్థానాల్లో సాధించిన మెజారిటీ కంటే ఎక్కువగా వచ్చిందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపారని, సాంకేతికంగా ఇప్పటివరకు ఎవరూ చేరలేదని చెప్పారు. కేటీఆర్‌ మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివిధ అంశాలపై కేటీఆర్‌ స్పందన ఆయన మాటల్లోనే... 

16 సీట్లూ గెలుస్తామని ఆశించాం... 
2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 34 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటి కంటే 2019లో 6శాతం ఓట్లు పెరిగాయి. 16 ఎంపీ సీట్లలో గెలుపు కోసం మేము గట్టిగా ప్రయత్నించాం. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు బాగా పని చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మేం కష్టపడినంతగా ఏ పార్టీ పని చేయలేదు. అయితే మేం ఆశించిన ఫలితాలు రాలేదు. మల్కాజిగిరి, భువనగిరిలో వెంట్రుకవాసి తేడాతో కాంగ్రెస్‌ గెలిచింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ హవా పని చేసింది. అందుకే బీజేపీకి ఇక్కడ సీట్లు వచ్చాయి. ఆదిలాబాద్‌లో గెలుస్తుందని బీజేపీ నేతలు, అక్కడి అభ్యర్థే ఊహించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్‌ కనిపించింది. ఈ ఫలితాలు టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ కాదు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకోవడంతో బీజేపీకి ఓటింగ్‌ పెరిగింది. బీజేపీకి కార్యకర్తలు లేనిచోట్ల సైతం ఆ పార్టీకి ఓట్లు పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీకి 19 వేల ఓట్లు లభిస్తే ఇప్పుడు ఏకంగా 59 వేల ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్‌ ఎంపీ స్థానాన్ని గెలుస్తామని బీజేపీ వాళ్లే అనుకోలేదు. కచ్చింగా 16 స్థానాల్లో గెలుస్తామని మేము భావించాం. ఇలాంటి ఫలితాలను ఊహించలేదు. 

అభ్యర్థుల ఎంపిక సబబే... 
నిజామాబాద్‌లో కవిత ఓడిపోయారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని దేవేగౌడ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. గతంలో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ పరాజయం పాలయ్యారు. రెండోసారి సీఎం అయిన కేసీఆర్‌ సైతం మొదటి ఎన్నికల్లో ఓడిపోయారు. టీఆర్‌ఎస్‌ డక్కామొక్కీలు తిన్న పార్టీ. ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగమించింది. కొందరు ముఖ్యనేతలు ఓడిపోయినంత మాత్రాన కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందనేది నిజం కాదు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అధైర్యపడొద్దు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సరిగా లేదనే వ్యాఖ్యలు సరికాదు. ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసిన వినోద్‌ కుమార్, బూర నర్సయ్యగౌడ్, కవిత ఓడిపోయారు. కొత్తగా పోటీ చేసిన వారు, పార్టీ మారిన వారు గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలుపోటములకు రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక్క కారణం అని చెప్పడానికి లేదు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గతంలో గెలిచినప్పుడు కిరీటాలు పెట్టలేదు... 
ఈ ఎన్నికల్లో 16 సీట్లు గెలిచినా కేంద్రంలో ఏమీ చేయలేని పరిస్థితే. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎవరి మద్దతు అవసరంలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కార్యకర్తలెవరూ కుంగిపోవాల్సిన పనిలేదు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌కు కేవలం 4.5 లక్షల ఓట్లు తగ్గాయి. రాష్ట్రంలో 40 శాతం ఓటర్లు టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలిపారు. మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో మా పార్టీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నేను విఫలమయ్యాయని అనుకోవడంలేదు. గతంలో విజయాలు సాధించినప్పుడు ఎవరూ కిరీటాలు పెట్టలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై లోతైన సమీక్ష చేస్తాం. వరుస ఎన్నికలు, పాలనలో జాప్యం వల్ల మా పార్టీపై ఏమైనా ప్రభావం పడిందేమో పరిశీలించుకుంటాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాం. సింహభాగం సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుస్తుంది. 

కేంద్రంతో రాజ్యాంగపరమైన సత్సంబంధాలు... 
రాష్ట్రాలు ఎంత బలపడితే దేశానికి అంత మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించే మానసిక పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదు. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, టీఆర్‌ఎస్, డీఎంకే వంటి పార్టీలే ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీని ఎదుర్కొంటాయి. దేశంలో ఫెడరల్‌ స్ఫూర్తి పెరగడం మంచిదే. కేంద్ర ప్రభుత్వంతో రాజ్యాంగపరంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎప్పుడూ సత్సంబంధాలనే కొనసాగిస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో అలాగే ఉంటాం. అయితే రాష్ట్ర సమస్యల పరిష్కారం విషయంలో రాజీపడం. మోదీతో మా సంబంధాలు రాజ్యాంగ పరమైనవిగానే ఉంటాయి. సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ ఓటమికి కారణం కాదు. బీజేపీ దేశమంతా గెలిచింది. మరి ఇతర ప్రాంతాల్లో కేసీఆర్‌లా ఎవరూ మాట్లాడలేదు కదా? 

హరీశ్‌రావును పక్కన పెట్టలేదు... 
మాజీ మంత్రి హరీశ్‌రావును లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పక్కనబెట్టామన్న వాదన నిజం కాదు. లోక్‌సభ సెగ్మెంట్ల బాధ్యతలను సీఎం కేసీఆర్‌ మంత్రులకు అప్పగించారు. మెదక్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ను సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తూ హరీశ్‌రావుకు అప్పగించారు. మెదక్‌లో టీఆర్‌ఎస్‌ మంచి మెజారిటీతో గెలిచినా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌కు ఓట్లు బాగా తగ్గాయి. సిరిసిల్లలోనూ ఇదే జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపీకి కార్యకర్తలు లేరు. కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అక్కడ బీజేపీకి భారీగా ఓట్లు పెరిగాయి. సీఎం కేసీఆర్‌ అన్ని లోక్‌సభ సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ అధినేతగా ఆయన ప్రచారం చేసిన తర్వాత నేనైనా, ఇంకెవరైనా ప్రచారం చేయడం ప్రధానం కాదు. విజయానికి కారకులు ఎక్కువ మంది తామే అంటారు. ఓటమి అనాథ లాంటిది. ఇప్పుడు ఎవరైనా, ఏదైనా మాట్లాడతారు. 

కవిత ఓటమికి రైతులు కారణం కాదు... 
నిజామాబాద్‌లో కవిత ఓటమికి రైతులు కారణం కాదు. అక్కడ నామినేషన్లు వేసింది రైతులు కాదు, రాజకీయ కార్యకర్తలే. జగిత్యాలకు చెందిన ఓ కాంగ్రెస్‌ నేత ఇంట్లోనే 93 మంది నామినేషన్లు తయారయ్యాయి. నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి కాబట్టే కవిత ఓడిపోయింది. టీఆర్‌ఎస్, నేను, కవిత అనేక డక్కామొక్కీలు తిన్నాం. ఒక్క ఓటమితో మేము కుంగిపోం. కవిత పోరాట యోధుడి కూతురు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ఓడిపోయారు. అంతమాత్రాన కాంగ్రెస్‌ కార్యకర్తలు దుప్పట్లు కప్పుకొని ఇంట్లో పడుకుంటారా? అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి వస్తే టీఆర్‌ఎస్‌కు నష్టం కలిగేది అనే వాదనతో ఏకీభవించను. ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ గెలిచింది. లోక్‌సభ ఫలితాల ప్రకారం చూసినా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు 71 స్థానాల్లో మెజారిటీ వచ్చింది.
 
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సాంకేతికంగా చేరలేదు... 
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ ఇప్పటివరకు సాంకేతికంగా టీఆర్‌ఎస్‌లో చేరలేదు. మా పార్టీ కండువా కప్పుకోలేదు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రకటించడం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో మాకు నష్టం జరిగిందనే వాదన సరికాదు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రకటించారు. వారికి చెందిన ఎనిమిది సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యత వచ్చింది. 

‘హాజీపూర్‌’పై రాజకీయాలా? 
హాజీపూర్‌ ఘటన నిజంగా దారుణం. అక్కడ జరిగిన దారుణంతో అందరం చలించిపోయాం. అందరం బాధపడ్డాం. ఇలాంటి విషయాల్లోనూ కొందరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. కొందరు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు. అలాంటి రాజకీయం మేము చేయం. బాధితులకు న్యాయం చేస్తాం. బాధితులను ఆదుకునే బాధ్యత మాది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుతో విచారణ వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ఇంటర్మీడియెట్‌ ఫలితాలపై వివాదాన్ని కొందరు గోరంతలు చేశారు. కొందరు విద్యార్థుల మరణం బాధాకరం. గ్లోబరీనా సంస్థకు, నాకు సంబంధం ఉందని పనికిమాలిన వాళ్లు విమర్శలు చేశారు. ఐటీ మంత్రిగా పని చేసిన నాకు విద్యాశాఖలోని అంశాలతో ఏం సంబంధం ఉంటుంది? 

జగన్‌ సొంతంగా గెలిచారు... 
ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి గెలిచారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటాలని అందరూ కోరుకుంటున్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలనేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానం. అందుకే మహారాష్ట్ర, కర్ణాటకతో బాగానే ఉంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌తోనూ ఇదే రకమైన సంబంధాలు కోరుకుంటున్నాం. ప్రమాణ స్వీకారానికి రావాలంటూ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. అంతేతప్ప ఈ భేటీలో ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు. టీఆర్‌ఎస్‌ సహకారంతో జగన్‌ గెలిచారనేది కరెక్టు కాదు. అక్కడ ప్రజలు తీర్పు చూసిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. జగన్‌మోహన్‌రెడ్డి సొంతంగా గెలిచారు. 3,600 కిలోమీటర్లకుపైగా ఆయన పాదయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తాం. 

Advertisement
Advertisement