టీఆర్‌ఎస్‌ ముందస్తు కసరత్తు! | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ముందస్తు కసరత్తు!

Published Sun, Dec 10 2017 3:00 AM

KTR to reviews constituencies wise TRS party conditions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండోసారి అధికారం కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పక్కా ప్రణాళికలతో పావులు కదుపుతోంది.  వివిధ అంశాల్లో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నామని భావిస్తున్న టీఆర్‌ఎస్, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే పనిలో ఉంది. దీనిలో భాగంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులను కూడా చక్కదిద్దుకునే పనిలో పడింది. వచ్చే ఎన్నికల్లో కనీసం తొంభై స్థానాల్లో గెలుస్తామని పలుమార్లు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 119 నియోజకవర్గాలను సమీక్షించాలని నిర్ణయించినా, ముందుగా రూరల్‌ నియోజకవర్గాలపైనే దృష్టిసారించనున్నారని తెలుస్తోంది. ఈ బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు అప్పజెప్పారని సమాచారం. ఈ మేరకు ఆయన ఇప్పటికే సిరిసిల్ల జిల్లా పరిధిలోని నియోజకవర్గాల సమీక్ష సమావేశం ముగించారు.

ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితితోపాటు, స్థానిక అవసరాలు, తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలు తదితరాల గురించి కూడా వివరాలు సేకరించనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ మున్సిపాలిటీల వారీగా సమీక్షలు జరిపి ఆయా మున్సిపాలిటీలకు కావాల్సిన నిధులు అందజేసి పనులు పూర్తి చేశారు. సమస్యలను తెలుసుకోవడంలో, పరిష్కరించడంలో ఈ ప్రయోగం ఫలితాల్నిచ్చిందని చెబుతున్నారు.  వివిధ పార్టీల ఎమ్మెల్యేలు చేరడంతో అసెంబ్లీలో పార్టీ బలం పెరిగినా, ఈసారి సొంతంగానే అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో టీఆర్‌ఎస్‌ వ్యూహరచన చేస్తోంది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులతో జరపనున్న సమావేశాల్లో రాజకీయ అంశాలపైనా ఒక అంచనాకు రానున్నారని సమాచారం. అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వివరాలు సేకరించి అవసరమైన పనులను మొదలు పెడతారని అంటున్నారు. దీనికోసం రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీల ఫండ్‌ వాడుకోవాలని కూడా నిర్ణయించారని తెలిసింది. నియోజకవర్గాల సమావేశాలు ముగిసిన తర్వాత నివేదిక రూపంలో సీఎం కేసీఆర్‌కు అందజేస్తారని సమాచారం.

Advertisement
Advertisement