అభివృద్ధే అండగా.. | Sakshi
Sakshi News home page

అభివృద్ధే అండగా..

Published Sun, Nov 18 2018 3:44 AM

Lakshma Reddy Sitting profile - Sakshi

జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన లక్ష్మారెడ్డి కేసీఆర్‌ కేబినెట్‌లో కీలకమైన మంత్రి పదవి చేపట్టారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక దాదాపు రూ.1000 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ముఖ్యంగా వైద్యశాఖ మంత్రి కావడంతో ఆ శాఖకు చెందిన పలు ఆస్పత్రుల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల కొత్తవి ఏర్పాటయ్యాయి. జిల్లాలోని పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందేలా మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇక 2014 ఎన్నికల్లో జడ్చర్లలో లక్ష్మారెడ్డి పోటీకి దిగి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవిపై గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి పైనే పోటీ ఆయన పడుతున్నారు. ఇద్దరు హేమాహేమీలే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కేసీఆర్‌ చరిష్మా, అభివృద్ధి పనులు, పాలమూరులో చేపట్టిన పలు పథకాలు తనను గెలిపిస్తాయని మంత్రి లక్ష్మారెడ్డి ధీమాతో ఉన్నారు.  నాగర్‌కర్నూలు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన మల్లు రవి 2008లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. చంద్రశేఖర్‌పై విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖర్‌పైనే ఓడిపోయారు. ఇక కాంగ్రెస్‌ తొలి జాబితాలోనే పేరు ప్రకటించడంతో ఈసారి మల్లు రవి ప్రచారం వెంటనే చేపట్టారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.   
ప్రత్యేకతలు 
- పోలేపల్లి సెజ్‌ ఈ ప్రాంతానికి తలమానికం 
జడ్చర్లలో ప్రత్యేకంగా మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు  
ఆస్పత్రులు, పీహెచ్‌సీల భవన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి  
జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి  
పట్టణంలో రహదారుల విస్తరణ, డివైడర్, బటర్‌ ఫ్లై లైట్లు  
రూ.5 కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్‌బండ్‌గా జడ్చర్ల చెరువు 
బాదేపల్లిలో రైతుబజార్‌ ఏర్పాటుతో పాటు మండలాల్లో వ్యవసాయ గోదాముల నిర్మాణం 
అన్ని గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణం, ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు  
బాలానగర్‌ మండల కేంద్రంలోనూ 30 పడకల ఆస్పత్రి భవనం  
 
ప్రధాన సమస్యలు  
జడ్చర్లకు కరువు ప్రాంతంగా గుర్తింపు ఉంది.  
సాగు నీటి సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే దాదాపు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉంది.  
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. 
జడ్చర్ల పట్టణంలో డ్రెయినేజీ సమస్య అలాగే ఉంది. 

సిట్టింగ్‌ ప్రొఫైల్‌
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా (ప్రస్తుత నాగర్‌కర్నూల్‌ జిల్లా) తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన చర్లకోల లక్ష్మారెడ్డి వైద్య విద్య (బీహెచ్‌ఎంఎస్‌) పూర్తిచేశాక జడ్చర్లలో కొద్ది రోజులు ప్రజలకు వైద్య సేవలందించారు. 1988లో ఆవంచ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరి తిమ్మాజీపేట మండల పరిషత్‌ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 1995లో తిమ్మాజీపేట సింగిల్‌విండో అధ్యక్షుడిగా, 1996లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పదవులు నిర్వర్తించారు. 1999లో జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతర క్రమంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్‌ పిలుపు మేరకు 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఓటమి పాలయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో మిత్రపక్షాల కలయికలో భాగంగా టీడీపీ నేతకు సీటు కేటాయించడంతో లక్ష్మారెడ్డి పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలో 14,734 ఓట్ల మెజార్టీతో జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్‌ మంత్రివర్గంలో మొదటగా విద్యుత్‌ శాఖ మంత్రిగా.. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో జడ్చర్ల స్థానం నుండి లక్ష్మారెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారు. 
ఇన్‌పుట్స్‌ : మేడిపల్లి శశిధర్‌రెడ్డి, జడ్చర్ల 

Advertisement
Advertisement