వర్గీకరణపై టీఆర్‌ఎస్‌ కపట నాటకం | Sakshi
Sakshi News home page

వర్గీకరణపై టీఆర్‌ఎస్‌ కపట నాటకం

Published Sun, Dec 31 2017 1:29 AM

laxman commented over trs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణపై టీఆర్‌ఎస్‌ కపట నాటకం ఆడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. శనివారంనాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్గీకరణ కోసం కలుస్తామంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమయం ఇవ్వడం లేదంటూ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఎస్సీలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు ఉన్న ప్రేమ ఏపాటిదో ఈ మూడున్నరేళ్ల నుంచి ఆచరణలోనే చూశామన్నారు. దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అని చెప్పిన సీఎం కేసీఆర్‌.. దాన్ని అమలు చేయకుండా తానే గద్దెపై కూర్చున్నారని అన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయడం లేదని, సబ్‌ప్లాన్‌ చట్టానికి కోరల్లేకుండా చేశారని ఆరోపించారు.

ఈ సంవత్సరంలో ఉద్యమాలతో బీజేపీ దూసుకు పోతుందన్నారు.  దళితులకు ఈ మూడున్నరేళ్లలో ఖర్చు చేసిందెంత అని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ఎస్సీ కమిషన్‌ వేయకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఎక్కడెక్కడ ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎస్సీల బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై ఆగడాలు పెరిగిపోతున్నాయన్నారు. 

Advertisement
Advertisement