ఈ కమలాతొనల రంగు వేరే!  | Sakshi
Sakshi News home page

ఈ కమలాతొనల రంగు వేరే! 

Published Wed, Nov 7 2018 1:41 AM

This Leader is best in the Party Alliances and He can never compete alone - Sakshi

మగానుబాబుడు అనే నేత ఎంతో తెలివైనవాడు. తన తెలివితేటలతో మోకాలికీ బోడిగుండుకూ ముడేయగల సమర్థుడు. సదరు నేత గత ఎన్నికల్లో, ఈసారీ తెలివిగా ఎలక్షన్‌ సీజన్‌కూ, పండ్ల సీజన్‌కూ ముడిపెట్టాడు. 

ఈ మగానుబాబుడు అనే నేత ఎన్నికల టైమ్‌లో పొత్తులు కుదుర్చుకోవడంలో దిట్ట. ఒంటరిగా ఎన్నడూ పోటీ చేయలేడు. ఎక్కడ ఎప్పుడు ఎలా మాక్సిమమ్‌ ప్రయోజనం దొరుకుతుందో పసిగట్టి దాన్ని అందుకోవడంలో ఘనుడు. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఎన్నికల సీజనూ, పండ్లసీజనూ వచ్చేయడంతో అర్జెంటుగా తన రూటూ, మాటా మార్చే పనిలో పడ్డాడు. 

అప్పటి ఎన్నికలూ ప్లస్‌ పండ్ల సీజన్‌లో కమలాలు చాలా మంచివని గర్జించాడు. ఇక్కడ కమలాలంటే కమలాపండ్లన్నమాట. వాటితో అధికారారోగ్య ప్రయోజనాలెన్నో ఉంటాయని గట్టిగా వాదించాడు. దాంతో అప్పట్లో చాలామంది అదే నిజమేమో అనుకున్నారు. 

సరిగ్గా మళ్లీ ఎన్నికలు వచ్చే టైమ్‌కు ఎందుకో కాషాయ కలర్లో ఉండే కమలాపండ్లు తన అధికారారోగ్యానికి సరిపోవని ఆయనకు అనిపించింది. వాటితో పాటు తెల్లటి అరటిపండ్లూ, ఆకుపచ్చటి జామపండ్లూ కూడా తినేద్దామని నిశ్చయించుకున్నాడు. 

ఇక మగానుబాబుడు ఎంత ఈజీగా వాదిస్తాడో అంతే సునాయాసంగా వాదన మార్చేస్తాడు. పొద్దస్తమానం కమలాలే తింటూ పోతే ఒకే రకం పోషకాలు దొరకచ్చు. కానీ ఒంటికి రకరకాల పండ్లు అవసరం. అందుకే ఈసారి నాకు అరటీ, జామా కావాల్సిందే అన్నాడు. 

వెంటనే గత సీజన్‌ మాటలు గుర్తుంచుకున్న కొందరు ‘అదేంట్సార్‌.. అప్పుడలా అన్నారు కదా’ అని నిలదీశారు. దానికిలా చెప్పాడాయన. ‘‘నిజమే అప్పుడు నేను కమలాలు మంచివన్నాను. తీరా ఒలిచాక తొక్క చేతిలోకి వచ్చింది. అది అచ్చం కమలం పువ్వులా అనిపించింది. పండైతే బెటరేమోగానీ, ఒలిచేసిన ఆ తొక్క ఎంత కమలం పువ్వు షేపులో కనిపించినా దాంతో ఏం లాభమనిపించింది. పైగా నా చెవి కోసమే ఉద్దేశించిన పువ్వులా కనిపించిందది. వెంటనే ఆ తొక్కను దూరంగా విసిరేసి మన నేల మురికి కాకుండా చూస్తున్నా’’ అన్నాడు. 

‘‘మరి కమలం పువ్వులా కనిపించిందని తొక్క పారేశారు సరే.. లోపలి తొనలు కూడా అదే రంగులో ఉన్నాయి కదా?’’ అని అడిగారు. ‘‘నో.. నో.. ఈ పండురంగు చాలా డిఫరెంట్‌. ఒలిచాక అరటి తెలుపు, ఒలవకపోయినా జామ ఆకుపచ్చ. కమలాతొనలు తింటున్నప్పటికీ వాటి రంగు వేరు. మా కొత్తపొత్తు పార్టీ జెండా తాలూకు రంగుల్లోని అరటి తెలుపు, జామాకుపచ్చకు పైన ఉండే రంగు వీటిది’’ అంటూ సమర్థించుకున్నాడు మగానుబాబుడు.  

Advertisement
Advertisement