ఆధార్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం | Sakshi
Sakshi News home page

ఆధార్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Published Fri, Jul 5 2019 3:28 AM

Lok Sabha passes Aadhaar and Other Laws Bill - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు, మొబైల్‌ కనెన్షన్‌ పొందేందుకు ఆధార్‌ కార్డును వాడేందుకు ఉద్దేశించిన ఆధార్, ఇతర బిల్లుల(సవరణ) చట్టం– 2019కు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాల కోసం, మొబైల్‌ కనెక్షన్ల కోసం ఆధార్‌ను ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వొచ్చు. లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ మాట్లాడుతూ..‘ప్రజల వ్యక్తిగత గోప్యత, భద్రత కోసం ఈ సవరణలు తెచ్చాం. ఆధార్‌ లేని కారణంగా ఎవ్వరికీ సంక్షేమ ఫలాలు నిరాకరించం. ప్రైవేటు సంస్థలు ఏవైనా ప్రజల ఆధార్‌ డేటాను నిల్వచేస్తే రూ.1కోటి జరిమానాతో పాటు జైలుశిక్ష పడుతుంది.

ఐటీ మంత్రి హోదాలో ఓ వ్యక్తి ఆధార్‌ వివరాలను నేను కోరినా నాకూ మూడేళ్లశిక్ష పడుతుంది. ఆధార్‌ వివరాలను  దేశభద్రతకు ముప్పు తలెత్తినప్పుడు, కోర్టులు ఆదేశించినప్పుడే పంచుకోవడానికి వీలవుతుంది. ఆధార్‌ కార్డుల్లోని పౌరుల వ్యక్తిగత సమాచారం భారత్‌లో సురక్షితంగా, భద్రంగా ఉంది’ అని తెలిపారు. ప్రస్తుతం 123 కోట్ల మంది ఆధార్‌ను వాడుతున్నారనీ, దీని కారణంగా ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లు ఆదా చేయగలిగిందని వెల్లడించారు. ఆధార్‌ సాయంతో 4.23 కోట్ల నకిలీ ఎల్పీజీ కనెక్షన్లు, 2.98 కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డులను తొలగించామన్నారు. త్వరలోనే డేటా సంరక్షణ చట్టాన్ని తెస్తామన్నారు. ఈ బిల్లును ఎన్సీపీ, సీపీఎం, ఏఐఎంఐఎం, ఐయూఎంఎల్‌ పార్టీలు వ్యతిరేకించాయి.

ఎంసీఐ బిల్లుకు రాజ్యసభ ఓకే: భారత వైద్య మండలి(సవరణ) బిల్లు–2019కు పార్లమెంటు గురువారం ఆమోదించింది. ఇందులోని నిబంధనల మేరకు ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంసీఐకి బదులుగా గవర్నర్ల బోర్డు 2018, సెప్టెంబర్‌ 26 నుంచి మరో రెండేళ్ల పాటు పాలన నిర్వహించనుంది. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రవేశపెట్టగా మూజువాణీ ఓటుతో ఆమోదం పొందింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. ‘ఎంసీఐ తన విధి నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. కాబట్టి ఎంసీఐని నిర్వహించే బాధ్యతను ప్రముఖ డాక్టర్లతో కూడిన గవర్నర్ల బోర్డుకు అప్పగించాం. మేం ఈ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం. కానీ పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుంది’ అని తెలిపారు. అలాగే బోర్డు సభ్యుల సంఖ్యను 7 నుంచి 12కు పెంచుతామన్నారు.

అద్దాల భవంతులపై ఆధారాల్లేవు..
అద్దాలతో నిర్మించిన భారీ భవంతులు ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటాయనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ లోక్‌సభలో తెలిపారు. ఓ భవనాన్ని అద్దాలతో పక్కాగా డిజైన్‌ చేస్తే లాభాలే ఎక్కువని వ్యాఖ్యానించారు. ‘ఈ విషయంలో గతంలో ఏవైనా అధ్యయనాలు జరిగిఉంటే నా దృష్టికి తీసుకురండి. పరిశీలిస్తాను. న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్‌లో నేను ఐదేళ్లు సంతోషంగా, నిక్షేపంగా ఉన్నా’ అని మంత్రి పేర్కొన్నారు.

Advertisement
Advertisement