బీజేపీ సంచలన నిర్ణయం | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో బీజేపీ సంచలన నిర్ణయం

Published Sun, Nov 10 2019 6:19 PM

Maharashtra BJP Says Not Forming Government - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ పంపిన ఆహ్వానంపై బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. సరైన సంఖ్యాబలం లేనందున ప్రభుత్వ ఏర్పాటుపై వెనుకంజ వేసింది. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్ష నేత, ఆపధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ గవర్నర్‌ను కలిసి ఈ విషయం తెలియజేశారు. అయితే  ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించిన విషయం తెలిసిందే. సోమవారంలోపు అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని గవర్నర్‌ గడవు విధించారు. దీనిపై ఆదివారం సాయంత్రం ఫడ్నవిస్‌ నివాసంలో భేటీ అయిన బీజేపీ కోర్‌ కమిటీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని నిర్ణయించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగినంత బలం లేదని.. సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసి తమ నిర్ణయాన్ని తెలిపింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత  ఉత్కంఠగా మారాయి.

మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం బీజేపీకి కనీసం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మద్దతు కూడగట్టలేమని భావించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని నిర్ణయించింది. సమావేశం అనంతరం ఫడ్నవిస్‌ శివసేనపై విమర్శల వర్షం కురిపించారు. ఠాక్రే  నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దమ్ము శివసేనకు ఉందా అంటూ సవాలు విసిరారు. సరైన సంఖ్యాబలం ఉండే శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చాని అన్నారు.


 

Advertisement
Advertisement