కేసీఆర్‌పై యుద్ధం చేస్తాం | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై యుద్ధం చేస్తాం

Published Fri, May 10 2019 6:49 AM

Mallu Bhatti Vikramarka Slams On KCR - Sakshi

ఖమ్మంరూరల్‌/తిరుమలాయపాలెం:  రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఎం కేసీఆర్‌పై యుద్ధం చేస్తామని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క హెచ్చరించారు. పాలేరు నియోజకవర్గం ఎప్పటికీ కాంగ్రెస్‌ పార్టీదేనని, తన స్వార్థం కోసం 93 వేల మంది ఓటర్లను మోసం చేసి పార్టీని వీడిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెపుతారని అన్నారు. ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లి, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామాల్లో గురువారం నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఐదేళ్ల పాలనలో వివిధ రూపాల్లో మింగిన అవినీతి సొమ్మును బయటకు కక్కిస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నా, అహంకార ధోరణితో ఇతర పార్టీల శాసనసభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని దుయ్యబట్టారు. నాలుగు కోట్ల మంది ఆకాంక్షను నెరవేర్చేందుకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, కేసీఆర్‌ కుటుంబం కోసం కాదని అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు అహర్నిశలు శ్రమించి కందాళ ఉపేందర్‌రెడ్డిని గెలిపిస్తే ప్రజలకు సేవ చేయకుండానే పార్టీ ఫిరాయంచడం పట్ల ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో ఉన్నారని, ఆయన కనిపిస్తే నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో చేసిన పనికి సంబంధించిన పెండింగ్‌ బిల్లుల కోసం కందాళ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మకద్రోహం చేసిన ఎమ్మెల్యే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ధైర్యముంటే తిరిగి ఎన్నికల్లో గెలవాలని సవాల్‌ విసిరారు.

చీటింగ్‌ కేసు నమోదు చేయాలి..  
కాంగ్రెస్‌ కార్యకర్తల కాయకష్టంతో గెలిచిన కందా ళ ఉపేందర్‌రెడ్డి కాంట్రాక్ట్‌లు, కంపెనీల ప్రయోజనం కోసం కాంగ్రెస్‌ను వీడారని, ఆయనపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర కు ముందు స్థానిక సీఎంఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. శాసనసభ దేవాలయం వంటిదని, అక్కడ మోసగాళ్లు ఉండడానికి వీల్లేద ని అన్నారు. పార్టీ మారిన వారు సభలో ఉంటే అసెంబ్లీకే అవమానమని ఎద్దేవా చేశారు. కందాళకు చెందిన దీపికా  కన్‌స్ట్రక్షన్, సుజన్‌ కంపెనీల ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే పదవిని తాకట్టు పెట్టారని, రాష్ట్ర ఖజానాను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ రెండు కంపెనీలపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని అన్నారు.

రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌ను పారదోలాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బచ్చోడును మండల కేంద్రంగా చెయ్యాలనే గ్రామస్తుల వినతిపై స్పందించిన భట్టి విక్రమార్క ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు పోట్ల నాగేశ్వరరావు, సోమ్లానాయక్, రూరల్‌మండల కాంగ్రెస్‌ అధ్య క్షు డు కళ్లెం వెంకటరెడ్డి, తిరుమలాయపాలెం మం డల అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కనకయ్య, అరవిందరెడ్డి, కన్నేటి వెంకన్న, భైరు హరినాధబాబు, చింతమళ్లరవి, మద్ది వీరారెడ్డి, బోడావెంకన్న, మొక్క శేఖర్‌గౌడ్‌ యశోదమ్మ, ఎర బోలుశ్రీను, బండి వినోద్‌ శ్రీనివాసరావు, పట్టాభి, బత్తుల కూర్మారావు, బత్తిని యాలాద్రి, పోలేపల్లి సర్పంచ్‌ బత్తుల నాగరత్తమ్మ ఉన్నారు.

Advertisement
Advertisement