‘కోట’లో కవిత | Sakshi
Sakshi News home page

‘కోట’లో కవిత

Published Fri, May 24 2019 1:26 PM

Malothu Kavitha Won in Mahabubabad - Sakshi

సాక్షి, కొత్తగూడెం: గిరిజనుల కోట అయిన మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో కారు జోరు కొనసాగించింది. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం 2009లో ఆవిర్భవించగా ఒకసారి కాంగ్రెస్, మరోసారి టీఆర్‌ఎస్‌లు గెలుపొందగా,  మూడోసారి ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల తొలి రౌండ్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత స్పష్టమైన ఆధిక్యతతో కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌పై ఘన విజయం సొంతం చేసుకున్నారు. తొలి నుంచి మహబూబాబాద్‌ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించడం, మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం, టీఆర్‌ఎస్‌ నాయకులు మాలోతు కవితకుఎంపీ టికెటు కేటాయించడంతో గతంలో కంటే మెజారిటీ గణనీయంగా పెరిగింది. ఎవరూ ఊహించని విధంగా మెజారిటీ కైవసం చేసుకున్నారు.

రాష్ట్రంలో తొలి గిరిజన మహిళా ఎంపీగా విజయకేతనం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి గిరిజన మహిళలకు ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించలేదు. దీంతో టీఆర్‌ఎస్‌ మహిళా జనాభా అధికంగా ఉన్న మహబూబాబాద్‌ పార్లమెంటు స్థానంలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా పోటీలో నిలిచే అవకాశం మాలోతు కవితకు కల్పించడంతో తొలి గిరిజన మహిళా ఎంపీగా  పార్లమెంటులో అడుగు పెట్టనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ విషయంలో నిరాశే ఎదురైనప్పటికీ పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉండడంతో ఆమెకు ఎంపీగా కేసీఆర్‌ అవకాశం కల్పించారు. 

కొత్త పాత నాయకుల సహకారంతోనే..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఇల్లెందు, పినపాక, ములుగు, భద్రాచలం అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందే సీటుగా అందరూ భావిస్తూ వచ్చారు. కానీ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆకర్ష్‌తో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. దీంతో కొత్త, పాత నాయకులను సమన్వయం చేస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తరచూ పార్లమెంటు పరిధిలో పర్యటించారు. అలాగే కేటీఆర్‌ రోడ్‌షో, కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహణతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం పెరిగింది. పాత, కొత్త తేడా లేకుండా అంతా కలిసికట్టుగా టీఆర్‌ఎస్‌ విజయం కోసం ముందుకు సాగారు. దీంతో అనూహ్యంగా గతంలో కంటే టీఆర్‌ఎస్‌ పార్టీ మెజారిటీ సాధించింది. 

భారీ ఆధిక్యతతో విజయం..
మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాలోత్‌ కవిత 1,46,663 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో మొత్తం 9,83,535 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 801 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉన్నాయి. మొత్తం ఓట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితకు 4,62,109 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌కు 3,15,446 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌కు 25,487, సీపీఐ అభ్యర్థి కల్లూరి వెంకటేశ్వరరావుకు 45,719 ఓట్లు పోలయ్యాయి. టీజేఎస్‌ అభ్యర్థి అరుణ్‌కుమార్‌కు 57,073 ఓట్లు రాగా, నోటాకు 14,082 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాలోత్‌ కవిత మొదటి రౌండ్‌ నుంచి చివరి వరకు తన సమీప ప్రత్యర్థి బలరాంనాయక్‌పై ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు. చివరకు 1,46,663 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. 

Advertisement
Advertisement