వర్గీకరణపై స్పష్టమైన విధానం ప్రకటించాలి  | Sakshi
Sakshi News home page

వర్గీకరణపై స్పష్టమైన విధానం ప్రకటించాలి 

Published Sat, Nov 11 2017 3:45 AM

Mandha Krishnamadiga comments on SC classification - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన విధానం చెప్పని పక్షంలో ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనకు నిరసన తప్పదని ఎమ్మార్పీఎస్‌ హెచ్చరించింది. ఈ మేరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగ జాతిలో ఉన్న ఆవేదనను, ఉద్యమ తీవ్రతను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి తెలియజేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజును కోరారు. శుక్రవారం ఇక్కడ ఏఐసీసీ కార్యాలయంలో రాజుతో కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. రాహుల్‌ గాంధీ తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులు వివరించేందుకు ఢిల్లీకి వచ్చినట్టు తెలిపారు.

ఎస్సీ రిజర్వేషన్లలో అసమానతలున్నాయని 1965లోనే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తించిందని, అప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందని కృష్ణ మాదిగ వివరించారు. ఆయా డిక్లరేషన్లు, తీర్మానాల ప్రతులను కొప్పుల రాజుకు అందజేశారు. ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా లేక అణచివేతకు గురైన కులాల పక్షాన స్పష్టమైన విధానం ప్రకటిస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. 23 ఏళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఎందరో బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని చెబుతూ భారతి ఉదంతాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించడం లేదని, అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ మేనిఫెస్టోలు, తీర్మానాలకే పరిమితం కారాదని కోరారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన విధానం ప్రకటిస్తే రాహుల్‌ గాంధీని స్వాగతిస్తామని, లేదంటే నిరసన తెలియపరుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ ప్రతినిధులు తీగల ప్రదీప్, ఎం.నారాయణ ఉన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement