రచనల నుంచి రాజకీయాల్లోకి: బరిలో ప్రముఖ రచయిత్రి

15 Nov, 2018 13:47 IST|Sakshi

సమాజం పట్ల నిబద్ధతతోనే ఈ నిర్ణయం

ముషీరాబాద్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మెర్సీ మార్గరేట్‌

సాక్షి, హైదరాబాద్‌ : అనతికాలంలోనే తెలుగు సాహిత్యంలో విశేషమైన పేరుప్రఖ్యాతులు సాధించుకున్న కవి, రచయిత్రి మెర్సీ మార్గరేట్‌. తాను ప్రచురించిన తొలి కవితా సంకలనం ‘మాటల మడుగు’తో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని గెలుపొందారు ఆమె. నిత్యం సాహిత్యంతో మమేకమవుతూ.. తన కవితల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావడానికి తపిస్తున్న ఆమె మరో మార్పు దిశగా ముందడుగు వేశారు. తెలంగాణలో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న వేళ.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు మెర్సీ మార్గరేట్‌. హైదరాబాద్‌ నగరంలోని ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు.

 
పుట్టిపెరిగింది ముషీరాబాద్‌లోనే..
ముషీరాబాద్‌లో పుట్టిపెరిగిన తనకు ఇక్కడి పరిస్థితులు, మురికివాడల్లో నివసిస్తున్న ఇక్కడి నిరుపేద ప్రజల జీవనస్థితిగతులు తెలుసునని మెర్సీ మార్గరేట్‌ అంటారు. ప్రతిసారి ఎన్నికలు వచ్చివెళుతున్నా.. నియోజకవర్గంలో పరిస్థితులు మెరుగుపడటం లేదని, సిటీ నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్‌ నియోజకవర్గంలో పరిస్థితులు దుర్భరంగా ఉండటం తనను కలిచి వేసిందని, ఇక్కడి ప్రజలకు ఏదైనా సేవ చేయాలని, ఇక్కడి పరిస్థితులు మార్చాలనే దృఢ సంకల్పంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
‘నగరంలో చాలామంది ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. ఓటు వేసేవారిలోనూ పలువురు ‘నోటా’ను ఎంచుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో నిస్వార్థంగా సేవ చేస్తారని నమ్మకం కలిగించే నాయకులు లేకపోవడమే ఇందుకు కారణం. చదువుకున్న విద్యావంతులు, సమాజం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే.. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు’ అని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అది రాజ్యాంగ నిర్దేశించిన సర్వోన్నతమైన బాధ్యత అని ఓటర్లకు పిలుపునిచ్చారు.
 
సమాజం పట్ల నిబద్ధతతో నిత్యం సాహిత్యంతో మమేకమవుతున్న తాను.. రాజకీయాల్లో మార్పు కోసమే ఎన్నికల బరిలోకి దిగానని, ఓటు హక్కుపై చైతన్యం కలిగించడం, యువత, విద్యావంతులూ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం లక్ష్యంగా ఈ ముందడుగు వేశానని ఆమె తెలిపారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు, వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషిచేసేందుకు ఎన్నికల్లో పోటీచేస్తున్నానని, ప్రజలు తనను ఆశీర్వదిస్తారన్న నమ్మకముందని మెర్సీ మార్గరేట్‌ చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు