Sakshi News home page

ఎవరికి వారే.. యమునా తీరే 

Published Sat, Dec 30 2017 7:43 AM

minister bhuma akhila priya vs av subba reddy in kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: మంత్రి అఖిలప్రియ, అధికారపార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య తాజా వివాదానికి, బలాబలాల ప్రదర్శనకు ఈ నెల 31న ఏర్పాటు చేసిన డిన్నర్‌ వేదికగా మారింది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. నూతన ఏడాదిని స్వాగతిస్తూ ఆ రోజున ఏవీ సుబ్బారెడ్డి డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి రావాలంటూ నంద్యాల, ఆళ్లగడ్డ నేతలకు స్వయంగా ఆహ్వానం పలికారు. 

హుకుం జారీ చేసిన మంత్రి..
దీంతో మంత్రికి కోపమొచ్చింది. తనకు తెలియకుండా ఆళ్లగడ్డలో డిన్నర్‌ ఇవ్వడమేంటని, ఎవ్వరూ వెళ్లొద్దని హుకుం జారీ చేశారు. అయినప్పటికీ బలం నిరూపించుకునేందుకు ఏవీ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఒక ఫంక్షన్‌ హాల్‌ను తీసుకుని భారీగా డిన్నర్‌ ఇస్తున్నారు. దీనికి రెండు నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యేలా చూసుకుంటున్నారు. 

తద్వారా తన బలమేమిటో చూపించాలని దృఢనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఆనందంగా గడుపుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ సాగాల్సిన డిన్నర్‌ కాస్త ఇద్దరి మధ్య డిష్యుం...డిష్యుంకు దారితీయడం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది.  

మొదటి నుంచీ అదే తీరు! 
ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డిది సుదీర్ఘ స్నేహ సంబంధం. భూమా నాగిరెడ్డి ఆత్మగా ఏవీని పిలిచేవారు. సుబ్బారెడ్డికి తెలియకుండా భూమా అడుగు కూడా వేసేవారు కాదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అయితే, భూమా నాగిరెడ్డి మరణం తర్వాత పరిస్థితి మారుతూ వచ్చింది. అఖిలప్రియకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో కూడా ఏవీ సుబ్బారెడ్డిని అఖిలప్రియ కనీసం పట్టించుకోలేదు. 

మాటలు కూడా లేవు..
ఇద్దరి మధ్య మాటలు కూడా లేకుండా పోయాయి. నంద్యాల ఉప ఎన్నిక అనంతరం ఆళ్లగడ్డలో తన పుట్టినరోజు సందర్భంగా ర్యాలీ నిర్వహించాలని ఏవీ పోలీసుల అనుమతి తీసుకున్నారు. అయితే, ర్యాలీ జరపకుండా మంత్రి నేరుగా రంగంలోకి దిగి అడ్డుకున్నారనే ప్రచారముంది. ఆళ్లగడ్డలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఏవీ బిల్డింగ్‌కు కూడా మంత్రి నోటీసులు ఇప్పించారు. నిర్మాణం ముందుకు సాగకుండా మంత్రి అడ్డుకున్నారనేది ఏవీ ఆరోపణ. ఈ క్రమంలోనే ‘న్యూఇయర్‌ డిన్నర్‌’తో ఇద్దరి మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయి.  

ఎవరికి వారే.. యమునా తీరే 
మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య వైరాన్ని తగ్గించి సర్దుబాటు చేసేందుకు అధికార పార్టీలో ఎవ్వరూ సాహసించడం లేదు. ఎవ్వరు చెప్పినప్పటికీ ఇద్దరూ వినే స్థితిలో లేరని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇక ఏవీ సుబ్బారెడ్డికి ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి కదలిక లేదు. కేవలం నంద్యాల ఉప ఎన్నికల్లో ఏవీని ఉపయోగించుకుని.. అవసరం తీరిన తర్వాత డమ్మీగా మార్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ నెల 31న డిన్నర్‌ వేదికగా బలనిరూపణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.  
 

Advertisement

What’s your opinion

Advertisement