ఆయనకే టికెట్‌ రాకపోతే ఆ కూటమెందుకు? | Sakshi
Sakshi News home page

ఆయనకే టికెట్‌ రాకపోతే ఆ కూటమెందుకు?: హరీష్‌

Published Sat, Nov 3 2018 4:37 PM

Minister Harish Rao Slams Grand Alliance In Telangana  - Sakshi

సిద్ధిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కరవు అనే పదం తెలంగాణాలో ఉండదని తెలంగాణా భారీ నీటిపారుదల శాఖామంత్రి, టీఆర్‌ఎస్‌ నేత తన్నీరు హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. సిద్ధిపేట కొండ మల్లయ్య గార్డెన్‌లో సిద్ధిపేట నియోజకవర్గ ప్రైవేటు స్కూల్క్‌ ఆధ్వర్యంలో మంత్రి  హరీష్‌ రావుకి ఆత్మీయ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన హరీష్‌ రావు మాట్లాడుతూ..సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డికే టికెట్‌ రాకపోతే ఆ మహాకూటమి ఎందుకు అని ఎద్దేవా చేశారు. సిద్ధిపేటలో బ్రహ్మాండమైన కార్మికభవన్‌ కట్టుకున్నామని చెప్పారు.

ఇన్ని రోజులు మనుషులు ఎర్రజెండా కింద ఉన్నా, మీ మనసులు గులాబీ జెండా కిందే ఉన్నాయని వ్యాఖ్యానించారు. అన్ని హక్కులు గులాజీ జెండా కిందనే సాధించుకుంటామని అందరూ ఎర్ర జెండా వదిలి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. ఆంధ్రాబాబు చంద్రబాబు దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడం ఇష్టం లేక ఎర్ర జెండా వదిలి టీఆర్‌ఎస్‌ జెండా కప్పుకుంటున్నారని అన్నారు. ఈటెల రాజేందర్‌ నాయకత్వంలో పౌరసరఫరాల శాఖ బ్రహ్మాండంగా ముందుకు వెళ్తోందని వ్యాఖ్యానించారు. బస్తా కూలీ రూ.8 నుంచి 14 కు పెంచిన ఘనత ఈటెల రాజేందర్‌కే దక్కుతుందన్నారు.

కార్మికుల బీమా విషయం మేనిఫెస్టోలో పెట్టేవిధంగా కృషి చేస్తానని తెలిపారు. కాళేశ్వరం పూర్తి అయితే తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారుతుందని వెల్లడించారు. అప్పుడు పౌరసరఫరాల శాఖ కార్మికులకు లాభం జరుగుతుందని చెప్పారు. పెన్షన్‌ వయసు 60 నుంచి 57కు తగ్గించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.  నేను సర్కారు దవాఖానాలకు పోతా బిడ్డా అనేలా నేడు ప్రభుత్వ ఆసుపత్రులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీర్చిదిద్దిందని వ్యాక్యానించారు. పేద ప్రజలకు ఉచిత నాణ్యమైన వైద్యం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు.

కల్యాణలక్ష్మీ పథకాన్ని కాంగ్రెస్‌‌ వాళ్లు బంద్‌ చేస్తే కాంగ్రెస్‌ దుకాణం తెలంగాణాలో బంద్‌ అవుతుందని జోస్యం చెప్పారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తీసేసి..ఫుల్లుగా తాగాలి..బండి నడపాలి అనే విధంగా ఈ మధ్య కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల విషయంలో కార్మికులకు సహాయం చేస్తామని వెల్లడించారు. స్వంతగా ఇల్లు నిర్మించుకునే వారికి రూ.5 లక్షల సహాయం అందిస్తామని తెలిపారు. మీకు నా పూర్తి సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. నెల రోజులు మీరు కష్టపడండి..మిగతా 5 సంవత్సరాలు తాము కష్టపడి పని చేస్తామని హరీష్‌ రావు అన్నారు.

Advertisement
Advertisement