Sakshi News home page

జ్యోతిబసు రికార్డును కేసీఆర్‌ తిరగరాస్తారు

Published Thu, Nov 16 2017 3:23 AM

Minister KTR comments about cm kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు రికార్డును సీఎం కేసీఆర్‌ తిరగరాస్తారని మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇక టీడీపీ కనుమరుగు అయినట్లేనని, ఢిల్లీ మోచేతి నీళ్లు తాగుతున్న కాంగ్రెస్‌కు ఇక్కడ పుట్టగతులు ఉండవన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నరసింగరావు, మంథని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ కర్రు నాగయ్య బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రులు కేటీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఈటల రాజేందర్‌.. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. చరిత్రలో కొన్ని మలుపులు అని వార్యంగా వస్తాయని, కాంగ్రెస్‌ పార్టీ ఆగడాలను అంతమొందించేందుకు ఎన్టీఆర్‌ టీడీపీ ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించిందన్నారు. గండ్ర సత్యనారాయణరావు చేరికతో భూపాలపల్లి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం ఇక బంద్‌ అని కడియం వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్‌ నాయకత్వానికి అండగా నిలవాలని ఈటల పేర్కొన్నారు.

ఉద్యమ సమయంలో ప్రజలు పార్టీకి ఎలా అండగా నిలబడ్డారో ఇప్పుడు ప్రభుత్వానికి అండగా నిలిచి తెలంగాణ పునర్నిర్మాణంలో బాధ్యులు కావాలని ఎంపీ బి.వినోద్‌ కోరారు. కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు సత్యనారాయణ రావు, నరసింగరావు, నాగయ్యలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పుట్ట మధు పాల్గొన్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement