వన్‌మ్యాన్‌ షో | Sakshi
Sakshi News home page

వన్‌మ్యాన్‌ షో

Published Wed, Feb 28 2018 11:12 AM

Minister narayana one man show on sc subplan funds - Sakshi

మంత్రి నారాయణ వన్‌మ్యాన్‌ షోకు తెరతీశారు. నగరంలో మేయర్‌తో సహా అధికారపార్టీ నేతలు అనేక మంది ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి జంప్‌ అయిన కార్పొరేటర్లు ఉన్నారు. ఏ ఒక్కరితో సంబంధం లేకుండా నగరంలో అన్ని తానై మంత్రి వ్యవహరించటం వివాదంగా మారుతోంది. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో పనుల నిర్వహించే విషయంలో నేరుగా కాంట్రాక్ట్‌ కంపెనీ మంత్రి నారాయణ మినహా మధ్యలో మరెవరికీ చోటు ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ తనకు అడ్డు ఏమీ లేదనే రీతిలో టెండర్‌ కేటాయించకుండానే ఎస్సీ సబ్‌ప్లాన్‌కు సంబంధించిన అభివృద్ధి పనులను మొదలు పెట్టించారు. పర్యవసానంగా నగరంలో అసలు ఏం జరగుతుందో కూడా అధికారపార్టీ నేతలకు తెలియని పరిస్థితి.

రూ.55 కోట్లతో పనులు
2017–18 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఉన్న ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో నగరంలోని దళితవాడల్లో అభివృద్ధి పనులు నిర్వహించాలని నిర్ణయించారు. రూ.75 కోట్ల నిధులకు గానూ రూ.55 కోట్లతో నగరంలోని దళితవాడల్లో 167 పనులు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వాస్తవానికి అయితే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే స్థానిక సంస్థలు వాటికి సంబంధించి అంచనాలు సిద్ధం చేసుకోవాలి. అనంతరం నివేదికలు పంపి వాటిని ఆమోదించాక టెండర్లు పిలిచి తక్కువ టెండర్‌ కోట్‌ చేసిన వారికి కేటాయిస్తారు. ఈ అయితే నిబంధనలు ఏమీ తనకు వర్తించవు అనే రీతిలో మంత్రి నారాయణ వ్యవహరించారు. నగరంలో మెత్తం 167 పనులకు సంబంధించి ఒకే ప్యాకేజ్‌గా సిద్ధం చేసి ఈ నెల 17వ తేదీన టెండర్లను ఖరారు చేశారు. అది కూడా పనులన్నీ కలిపి సింగల్‌ టెండర్‌ రూపంలో ఎన్‌సీసీ లిమిటెడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కంపెనీకి కట్టబెట్టారు. ఈ వ్యవహరం అంతా నెల్లూరుతో సంబంధం లేకుండా అమరావతిలోని మంత్రి నారాయణ పేషీ నుంచి జరగటం విశేషం. నగరంలో గుర్తించిన 55 ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం పనులు దీనిలో భాగంగా నిర్వహించనున్నారు. అలాగే  

మిగిలిన రూ.20 కోట్ల నిధులతో పాఠశాలలకు కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు నిర్వహించనున్నారు. గత ఏడాది సబ్‌ ప్లాన్‌ ని«ధులు నగరానికి రూ.42 కోట్లు మంజూరు కావటంతో పనుల పంపకాల్లో అధికారపార్టీ కార్పొరేటర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పనుల్లో ఎవరి జోక్యం లేకుం డా మంత్రి నారాయణ అన్నీ తానై చూసుకోవటంతో పాటు నేరుగా కాంట్రాక్టర్లతో మాట్లాడుకుని వారికి సహకరించాలనిని అధికారులను ఆదేశించారు.

టెండర్‌కు ముందేపనుల ప్రారంభం
ఇదిలా ఉంటే ఈనెల 17న టెండర్లను ఎన్‌సీసీ కంపెనీకి కట్టబెట్టారు. అయితే దీని కంటే 20 రోజుల మందు నుంచే నగరంలో టెండర్లకు సంబంధించిన పనులు నిర్వహించడం గమనార్హం. కనీసం ఆయా డివిజన్లలో జరిగే పనులకు సంబంధించి కార్పొరేటర్లకు కూడా తెలయని పరిస్థితి. మరోవైపు రూ.55 కోట్ల విలువైన పనులను కేటాయించటంతో పాటు కాంట్రాక్టర్‌ కు అదనపు లబ్ధి కూడా చేకూరేలా జీఓ జారీ చేశారు. రూ.55కోట్ల పనులకు 2.27 శాతం అదనంగా అంటే మరో రూ.2.27 కోట్లు అదనంగా ఇచ్చేలే జీఓ జారీ చేశారు. వచ్చే నెలాఖరులో సబ్‌ప్లాన్‌ ని«ధుల కాలం చెల్లనున్న క్రమంలో ఆఘమేఘాల మీద పనులు మొదలుపెట్టారు. నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలంటే ఎంతమేరకు నాణ్యత ఉంటుందనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎస్‌సీసీతో పాటు మరికొన్ని కార్పొరేట్‌ కంపెనీలను రంగంలోకి దింపి వారికి సబ్‌ కాంట్రాక్ట్‌ కూడా ఇచ్చేలా మంత్రి వ్యవహరించారు. ఈ క్రమంలో మంగళవారం చీఫ్‌ ఇంజినీర్‌ చంద్రయ్య పనులను పరిశీలించారు.

Advertisement
Advertisement