కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తా 

11 Jul, 2018 01:30 IST|Sakshi

     ఎమ్మెల్యే సోమారపు ప్రకటన

     ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటానని వెల్లడి

     ప్రగతి భవన్‌లో కేటీఆర్‌తో భేటీ

     రామగుండం మేయర్‌పై అవిశ్వాస వివాదానికి తెర

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. కేసీఆర్‌ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటానని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో తాను లేనని చెప్పారు. రామగుండం మేయర్‌పై అవిశ్వాసం, తదనంతర పరిణామాల నేపథ్యంలో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం ప్రకటించిన ఆయన మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో మంత్రి కె. తారక రామారావుతో భేటీ అయ్యారు. రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని, సమస్యలను పరిష్కరించుకుందామని కేటీఆర్‌ సూచించడంతో సోమారపు అంగీకరించారు. ఈ సందర్భంగా మేయర్‌పై అవిశ్వాసం విషయంలో తలెత్తిన వివాదానికి తెరదించారు.

నియోజకవర్గంలోని ఫాంహౌస్‌లో ఉన్న సీఎం కేసీఆర్‌తో సత్యనారాయణ చేత కేటీఆర్‌ ఫోన్లో మాట్లాడించినట్లు తెలిసింది. అలాగే అవిశ్వాసం విషయంలో సోమారపు నిర్ణయానికి కేటీఆర్‌ అంగీకరించినట్లు తెలియవచ్చింది. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎంపీ జి. వివేక్‌ పాల్గొన్నారు. అనంతరం సోమారపు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో కేసీఆర్‌కు బాగా తెలుసునన్నారు. 20 ఏళ్లలో కట్టాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును రెండేళ్లలో కేసీఆర్‌ పూర్తి చేస్తున్నారన్నారు. ఇంత మంచి టీం నుంచి ఎంత పిచ్చోడైనా పోవాలని అనుకోడన్నారు.

సీఎం కేసీఆర్‌ ఏ పని చేసినా పూర్తయ్యేదాకా తపస్సులా పనిచేస్తారన్నారు. తరచూ సీఎం కేసీఆర్‌ను కలసి ఇబ్బంది పెట్టొద్దని ఒకసారి ఆయన్ను కలిశాకే తెలుసుకున్నట్లు సోమారపు చెప్పారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌లో ఉన్నా ఖాళీగా కూర్చోరని, ఏదైనా విషయం ఫైనల్‌ అయ్యేదాకా ఆలోచిస్తూనే ఉంటారని వివరించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే తన అభిమానులు కంటతడి పెట్టారంటూ సోమారపు భావోద్వేగానికి లోనయ్యారు.

మరిన్ని వార్తలు