అభ్యర్థులను ప్రకటించడానికి లోకేశ్‌ ఎవరు? | Sakshi
Sakshi News home page

అభ్యర్థులను ప్రకటించడానికి లోకేశ్‌ ఎవరు?

Published Thu, Jul 12 2018 2:59 AM

MP TG Venkatesh was angry on Nara Lokesh - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి నారా లోకేశ్‌ ఎవరని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ప్రశ్నించారు. కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సోమవారం మైనార్టీ మహిళలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ఎస్వీ మోహన్‌రెడ్డి, లోక్‌సభ అభ్యర్థిగా బుట్టా రేణుక పోటీ చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై ఎంపీ టీజీ వెంకటేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కర్నూలులో అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడారు. లోకేశ్‌ టీడీపీ అధినేత కాదని, ముఖ్యమంత్రి కూడా కాదని, అలాంటప్పుడు అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ‘‘నా స్పందన ఒకటే ఉంటుంది. లోకేశ్‌ మంత్రి. ఆయన పార్టీ ప్రెసిడెంట్‌ కాదు. ముఖ్యమంత్రి కూడా కాదు.

కర్నూలు జిల్లాకు ప్రభుత్వ కార్యక్రమం కోసం వచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం నిజంగా నాకు అంతుబట్టడం లేదు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా పొద్దున బీ ఫారం ఇచ్చే ముందు అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటారు. సర్వే చేసిన తర్వాత ముందుకు పోతామని చంద్రబాబు నాతో చాలాసార్లు చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలంటున్నారు. దానిపై కూడా స్పష్టత ఇచ్చారు. మరి ఆయన(లోకేశ్‌) ఎందుకు ఆ విధంగా స్పందించారో నాకు తెలియదు. ఎస్వీ మోహన్‌రెడ్డి హిప్నాటైజ్‌ చేశారేమో లోకేశ్‌ను.

మా మోహన్‌రెడ్డి ఏమైనా చేయగలరు. ప్రభుత్వ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించి.. వీళ్లకు ఓట్లు వేయండని అడగటం నాకు నిజంగా ఇప్పటికీ అంతుబట్టడం లేదు. అద్భుతంగా ఉంది. లోకేశ్‌ కూడా అలా మాట్లాడరు. మా మోహనుడు హిప్నాటైజ్‌ చేసినట్టున్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాతే నేను స్పందిస్తా’’ అని టీజీ వెంకటేష్‌ స్పష్టం చేశారు.  

Advertisement
Advertisement