ఊగిసలాటలో ముఖేశ్‌..! 

2 Jul, 2018 04:11 IST|Sakshi
మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీలో ఉండాలా..? అధికార టీఆర్‌ఎస్‌లో చేరాలా? అనే విషయంపై మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ ఎటూ తేల్చుకోలేకపోతున్నా రు. కాంగ్రెస్‌లో తగిన ప్రాధాన్యం లేని కారణంగా పార్టీని వీడాలని దాదాపు నిర్ణయం తీసుకున్నా.. వేచిచూసే ధోరణిలో ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీని వీడొద్దంటూ కాంగ్రెస్‌ నుంచి వస్తున్న ఒత్తిడితో పాటు టీఆర్‌ఎస్‌ నుంచి స్పష్టమైన ఆహ్వానం, హామీ రాకపోవడంతో తొందర వద్దనే భావనలో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి తోడు ముఖేశ్‌ టీఆర్‌ఎస్‌లోకి రాకుండా నగరానికి చెందిన ఓ కీలక మంత్రి అడ్డుపుల్ల వేస్తుండటం కూడా ఆయనకు ఇబ్బందిగా మారుతోంది. అయితే, నగరానికే చెందిన ఓ ఎంపీ ఆయన్ను పార్టీ మారాలని ప్రోత్సహిస్తుండటంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లోకి ముఖేశ్‌ వెళ్లిపోయారు. వాస్తవానికి తన జన్మదినం సందర్భంగా ఆదివారమే ఓ నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు.

జన్మదిన వేడుకల్లో హడావుడి.. 
తన రాజకీయ భవితవ్యంపై జన్మదినం సందర్భంగా అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని, అక్కడే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించాలని ముఖేశ్‌గౌడ్‌ తొలుత భావించారు. అయితే ఆదివారం ఉదయం నుంచి జాంబాగ్‌లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలకు నేతలు, కార్యకర్తల రాకతో హడావుడి నెలకొంది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి డి.కె.అరుణ, ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి తదితరులు వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ్‌ ముఖేశ్‌తో కొంతసేపు మాట్లాడారు. పార్టీ మారవద్దని, ఏదైనా ఉంటే గాంధీభవన్‌లో మాట్లాడి పరిష్కరించుకుందామని సూచించారు. అయితే, అంతకుముందే గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు ముఖేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి.. 45 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. త్వరలోనే ముఖేశ్‌ పార్టీలోకి వస్తారని, పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామని అక్కడ ఉన్న ముఖేశ్‌ అనుచరులతో బహిరంగంగానే చెప్పి వెళ్లిపోయారు.

కొనసాగుతున్న సస్పెన్స్‌
ప్రస్తుతానికి ముఖేశ్‌ గౌడ్‌ గందరగోళంలో ఉన్నారు. పార్టీలో చేరాలని ఆహ్వానించిన మైనంపల్లి నుంచి ఎలాంటి స్పష్టతా రాకపోవడం, తాను పార్టీలోకి రాకుండా ఓ మంత్రి అడ్డుకుంటుండటంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ముఖేశ్‌ గౌడ్‌ అనుచరుడైన బీజేపీ కార్పొరేటర్‌ ఒకరిని పార్టీలోకి తీసుకువచ్చి గోషామహల్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఇప్పించాలని ఆ మంత్రి ప్రయత్నిస్తున్నారని ముఖేశ్‌ గౌడ్‌ వర్గం అంటోంది. కానీ, నగరానికే చెందిన ఓ ఎంపీ మాత్రం ముఖేశ్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి రావాలని, తద్వారా తనకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా మేలు కలుగుతుందనే ఆలోచనలో ఉన్నారని, ఆయన చొరవతోనే ముఖేశ్‌ గౌడ్‌ పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖేశ్‌గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటారా.. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరతారా అనే సస్పెన్స్‌ ఇంకొన్ని రోజులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా