మోదీ ఎక్కిన ప్లేన్‌ పాక్‌ నుంచి వచ్చింది | Sakshi
Sakshi News home page

మోదీ ఎక్కిన ప్లేన్‌ పాక్‌ నుంచి వచ్చింది

Published Wed, Dec 13 2017 4:39 PM

narendra modi broken norms - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తుది రోజైన మంగళవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘సీప్లేన్‌’లో ప్రయాణించడం పలు రకాలుగా వివాదాస్పదమైంది. స్పైస్‌జెట్‌ ఏర్పాటు చేసిన ‘కొడాయిక్‌ ఎన్‌181కేక్యూ’ సీప్లేన్‌ ఆరేబియన్‌ గల్ఫ్‌ ప్రాంతం నుంచి బయల్దేరి పాకిస్థాన్‌లోని కరాచి మీదుగా ముంబైకి వచ్చింది. జెడ్‌ ప్లస్‌ క్యాటగిరీ భద్రతను కలిగిన ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా నిబంధనలను ఉల్లంఘించి ఈ విమానం ఎక్కడం ఏమిటని పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరీ సింగిల్‌ ఇంజిన్‌ కలిగిన విమానం ఎక్కడం ఏమిటని విస్తుపోతున్నాయి.

ఒక్క ప్రధాన మంత్రియే కాదు, జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కలిగిన ఏ వ్యక్తి కూడా సింగిల్‌ ఇంజిన్‌ కలిగిన విమానంలో ప్రయాణించరాదని భద్రతా మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. డబుల్‌ ఇంజిన్‌ కలిగిన విమానంలో ఎక్కితే ఒక ఇంజిన్‌ చెడిపోయినా మరో ఇంజిన్‌ సాయంతో విమానాన్ని పైలట్‌ దించవచ్చన్నది ఇక్కడ ఉద్దేశం. సింగిల్‌ ఇంజిన్‌ విమానంలో ప్రయాణిస్తే ఆ ఇంజిన్‌లో సమస్య వస్తే ప్రాణ రక్షణకు భరోసా ఉండదు. ఆరేబియా గల్ఫ్‌ నుంచి వచ్చిన కొడాయిక్‌ సీప్లేన్‌ మార్గమధ్యంలో పాకిస్థాన్‌లో కరాచిలో ఆగిందో, లేదోగానీ అక్కడి నుంచి వచ్చిందంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మణిశంకర్‌ అయ్యర్‌ నివాసంలో మన్మోహన్‌ సింగ్, పాక్‌ దౌత్య అధికారులు కలుసుకున్నారంటేనే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పాక్‌ కుట్ర పన్నిందంటూ ఆరోపణలు చేసిన ప్రధాని మోదీకి ఈ జాగ్రత్తల గురించి తెలియదా?

అస్తమానం ‘మేకిన్‌ ఇన్‌ ఇండియా’ అనే మాట్లాడే మోదీ ప్రయాణించిన ‘కొడాయిక్‌ సీప్లేన్‌’ అమెరికాలో రిజిస్టర్‌ అయింది. అక్కడి రిజిస్టర్‌ నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ ప్రయాణికులను తీసుకెళ్లేందుకు దీన్ని ఉపయోగించరాదు. పైగా ఈ విమానాన్ని నడిపిందీ కెనడా పైలెట్‌. ‘ మోదీ గురించి ఆ కెనడా పైలట్‌ చేసిన వ్యాఖ్యలు  ప్రతిపక్షాలు విన్నాయంటే నోరు మూసుకోవాల్సిందే’ అంటూ ‘టైమ్స్‌నౌ’ ఓ భారీ శీర్షికను పెట్టింది. ఇంతకు ఆ కెనడా పైలట్‌ మోదీ గురించి చేసిన కామెంట్‌ ఏమిటంటే...‘మోదీ ఓ మంచి ప్రయాణికుడు’ అని. ఈ విషయాన్ని పక్కన పెడితే అమెరికాలో రిజిస్టర్‌ అయిన సింగిల్‌ ఇంజిన్‌ విమానం, పైగా పాకిస్థాన్‌ నగరం నుంచి వస్తే, అందులోనూ కెనడా పైలెట్‌ నడుపుతుంటే మోదీ ఎక్కడం,  అంబాజీ ఆలయాన్ని సందర్శించుకొని రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది దేశం సాధించిన అభివృద్ధా ? వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నమా?!

Advertisement
Advertisement