కాంగ్రెస్‌కు ఏడు సీట్లు వస్తే ఎక్కువే.. | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఏడు సీట్లు వస్తే ఎక్కువే..

Published Wed, Feb 21 2018 7:58 PM

Nayani Narasimha Reddy takes on congress - Sakshi

సాక్షి, జహీరాబాద్‌ ‌: వచ్చే పదేళ్ల వరకు కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణానికి వచ్చిన సందర్భంగా స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ సీఎం కష్టపడని విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రజల అభీష్టం మేరకు పనులు చేస్తున్న సీఎం దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచారని కొనియాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీటు తప్పకుండా వస్తుందని, ఎక్కడైతే పరిస్థితి వీక్‌గా ఉందో అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి వారి బంధువులకు టిక్కెట్‌ ఇచ్చి గెలిపించుకుంటామన్నారు.

కొత్త దుకాణాలు ఎక్కువరోజులు నడవవు..
కాంగ్రెస్‌ పార్టీ పగటి కలలు కంటోందని నాయిని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ గెలిస్తే గడ్డం తీస్తానని శపథం చేసిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి గడ్డం కుమార్‌ రెడ్డిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌కు ఏడు కంటే ఎక్కువ సీట్లు రావన్నారు. బీజేపీకి ఒక్క సీటు వస్తే గొప్పేనని ఆయన చెప్పారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా ఫర్వాలేదని, కొత్త దుకాణాలు ఎక్కువ రోజులు నడవవని, చివరికి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా నంబర్‌ వన్‌గా ఉందని, అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఏ రాష్ట్రంలో లేని పథకాలను సీఎం అమలు చేస్తున్నారని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మిషన్‌ కాకతీయ పనులను చూసి సీడబ్ల్యూసీ ఇంజినీర్లు మెచ్చుకున్నారని ఆయన చెప్పారు. మిషన్‌ భగీరథ పథకాన్ని విదేశీయులు సైతం అభినందిస్తున్నారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement