అవిశ్వాసంలో బీజేపీకి మిత్రపక్షం ఝలక్‌ | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 21 2018 9:51 AM

NDA Govt lost peoples confidence, Says Shiv Sena  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందికర పరిణామం ఎదుర్కొంది. ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను బహిష్కరించింది. సభలో జరిగిన ఓటింగ్‌లోనూ పాల్గొనలేదు. కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ బీజేపీతో శివసేన అధికారాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామం నేపథ్యంలో బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకునే అవకాశముందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై వేచిచూసి ధోరణిలో ఉన్నామని, బీజేపీతో బ్రేకప్‌ విషయంలో తామేమీ ఆందోళన చెందడం లేదని శివసేన వర్గాలు అంటున్నాయి.

నిజానికి అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభకు తమ ఎంపీలందరూ హాజరుకావాలని శివసేన లోక్‌సభ పక్ష నేత ఆనంద్‌రావు అద్సుల్‌ విప్‌ కూడా జారీచేశారు. బీజేపీ నేతల బుజ్జగింపులతో ఆయన విప్‌ జారీచేసినట్టు తెలుస్తోంది. అయితే, శుక్రవారం ఉదయానికి శివసేన అధినాయకత్వం వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతల తీరుతో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీతో శివసేన గతకొంతకాలంగా ఘర్షణపూరితమైన వైఖరిని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభకు దూరంగా ఉన్న శివసేన మరోవైపు.. మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. లోక్‌సభలో మోదీ సర్కారు అవిశ్వాస తీర్మానంలో నెగ్గినా.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే లోక్‌సభకు తాము గైర్హాజరయ్యాయమని శివసేన నేతలు చెప్తుండగా.. శివసేన అధికార పత్రిక సామ్నా బీజేపీ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడింది. ‘జంతువులను కాపాడుతూ.. మనుషులను చంపే కసాయిలు నేడు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న వారిలో కనీసం దయా, జాలి లేకుండాపోయాయి. ఎలాగైనా గెలుస్తూ.. అధికారంలో కొనసాగడమే ప్రజాస్వామ్యం కాదు. మెజారిటీ శాశ్వతం కాదు. ప్రజలే సుప్రీం’ అని సామ్నా పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement