ఓటు.. కుటుంబమంతా ఒకే చోటు! | Sakshi
Sakshi News home page

ఓటు.. కుటుంబమంతా ఒకే చోటు!

Published Thu, May 17 2018 2:51 AM

A new trend in panchayat voters list - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామపంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలో కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఇప్పటివరకు కుటుంబంలోని సభ్యుల ఓట్లు వివిధ వార్డుల్లో ఉండగా.. తాజాగా కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే వార్డులో ఉండేలా మార్పులు చేశారు. జాబితా ముసాయిదా రూపకల్పన సమయంలోనే కుటుంబంలోని ఓటర్లను వరుసగా నమోదు చేశారు. పంచాయతీలోని మొత్తం ఓటర్లు, ఒక్కో వార్డులోని ఓటర్ల సంఖ్యను ముందే లెక్కేసి.. అందుకు అనుగుణంగా మార్పులు చేశారు.

వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఏప్రిల్‌ 30న అన్ని పంచాయతీల్లో, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో ప్రదర్శించారు. మే 8 వరకు అభ్యంతరాలు స్వీకరించి ప్రస్తుతం వీటిని పరిష్కరిస్తున్నారు. అన్నీ పూర్తి చేసి మే 17న తుది జాబితా వెల్లడించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. జిల్లా పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో రూపొందించిన ఈ జాబితాను గ్రామాల వారీగా ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. పంచాయతీల్లోని 3 ప్రధాన ప్రదేశాల్లో, మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలోని నోటీసు బోర్డుల్లో జాబితాను ప్రదర్శించనున్నారు. అనంతరం ప్రభుత్వం బీసీ ఓటర్లను లెక్కించి, పంచాయతీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. రిజర్వేషన్ల వివరాలు అందిన తర్వాత ఎన్నికల సంఘం పోలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటిస్తుంది.  

1.13 లక్షల బూత్‌లు 
ఉమ్మడి ఏపీలో ఐదేళ్ల క్రితం పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెలంగాణలో 8,778 పంచాయతీలు.. 88,682 వార్డులు ఉండేవి. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో వీటి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 12,751 పంచాయతీలు.. 1,13,380 వార్డులున్నాయి. బ్యాలెట్‌ బాక్సులతో పోలింగ్‌ జరిగే సర్పంచ్‌ ఎన్నికకు ఒక్కో వార్డుకు ఒక బ్యాలెట్‌ బాక్సు అవసరం. ఒకే బాక్సులో సర్పంచ్, వార్డు సభ్యుడి ఎన్నికల బ్యాలెట్‌ పత్రాలు వేసి లెక్కింపు సమయంలో వేరు చేసి లెక్కిస్తారు. పెరిగిన వార్డుల సంఖ్యకు అనుగుణంగా కర్ణాటక, తమిళనాడు నుంచి బ్యాలెట్‌ బాక్సులు సమకూర్చారు.  

Advertisement
Advertisement