ప్రధానమంత్రి కావాలని కలలు కనడం లేదు! | Sakshi
Sakshi News home page

Published Mon, May 14 2018 1:55 PM

Nitin Gadkari Comment on PM Post - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి కావాలని తాను కలలు కనడం లేదని సీనియర్‌ కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని, నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన అత్యంత కీలక మంత్రిత్వశాఖలను నిర్వహిస్తున్న నితిన్‌ గడ్కరీ మోదీ కేబినెట్‌లో స్వతంత్రంగా పనిచేస్తున్న కొద్దిమంది మంత్రుల్లో ఒకరిగా పేరొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తగినంత మెజారిటీ రానిపక్షంలద్దితర పార్టీల మద్దతు కోసం కమలదళం ప్రధానమంత్రి పదవి విషయంలో రాజీపడవచ్చునని, మిత్రపక్షాలకు అంగీకారయోగ్యంగా మోదీకి బదులు నితిన్‌ గడ్కరీని తెరపైకి తీసుకురావచ్చునని కథనాలు, ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హిందూస్తాన్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రధాని మోదీ పనితీరుపై స్పందిస్తూ.. విధానా నిర్ణయాలు ప్రధాని చేతిలో కేంద్రీకృతం అయ్యాయనే ప్రతిపక్షాల వాదన తప్పు అని, ప్రధాని మోదీ కేబినెట్‌లో మంత్రులందరూ స్వతంత్రంగా పనిచేస్తున్నారని, కేబినెట్‌ సమావేశాల్లో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నారని, కొన్నిసందర్బాల్లో ప్రధాని మోదీతోసైతం విభేదించి తమ అభిప్రాయాలు చెప్తున్నారని ఆయన వివరించారు. తనకు జీవితంలో ఎలాంటి ఆశయాలు లేవని, తానో మామూలు వ్యక్తిని, సాధారణ కార్యకర్తనని, కేంద్రమంత్రిగా రూ. 10 లక్షల కోట్ల పనులు చేయిస్తున్నా.. కాంట్రాక్టర్ల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని ఆయన అన్నారు. రాజకీయాలు అంటే తనకు సామాజిక-ఆర్థిక సంస్కరణ మాత్రమేనని, అంతేకానీ తన జీవితంలో ఏనాడూ ప్రధాని పదవి గురించి కలలు కనలేదని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement