నేడు మళ్లీ అవిశ్వాసం | Sakshi
Sakshi News home page

నేడు మళ్లీ అవిశ్వాసం

Published Mon, Mar 19 2018 1:36 AM

No-confidence motion again today  - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు సోమ వారం లోక్‌సభ స్పీకర్‌ ముందుకు రానుంది. పార్టీ తరపున ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్ర వారం లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌ స్నేహలతా శ్రీవాత్సవకు మరోసారి అవిశ్వాసం నోటీసు అందజేసిన సంగతి తెలిసిందే. సభా నిబంధ నల ప్రకారం కేంద్ర మంత్రి మండలి సభా విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన నోటీసు లో పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ తోట నర సింహం కూడా అవిశ్వాస తీర్మానం నోటీసును స్నేహలతా శ్రీవాత్సవకు అందజేశారు.

 ఏం జరుగుతుందో..?
వైఎస్సార్‌సీపీ ఈ నెల 15న తొలిసారి అవి శ్వాస తీర్మానం నోటీసు ఇవ్వగా... టీడీపీ కూడా ఆ మర్నాడే ఇదే నోటీసును ఇచ్చింది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు అవసరమైన సంఖ్యా బలం ఉన్నప్పటికీ, సభ ఆర్డర్‌లో లేదని చెబుతూ ఈ నోటీసులను పక్కనపెట్టినట్లు 16న లోక్‌సభ స్పీకర్‌ ప్రకటిం చారు. ఈ నేపథ్యంలో పట్టు వదలకుండా అదేరోజు సాయంత్రం వైవీ సుబ్బారెడ్డి మరో నోటీసు ఇచ్చారు.

వైవీ, తోట నరసింహం ఇచ్చిన నోటీసులను సోమవారం మధ్యాహ్నం 12 గంటల తరువాత లోక్‌సభ స్పీకర్‌ మళ్లీ పరిగణనలోకి తీసుకోనున్నం దున ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయోనని రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.సభ ఆర్డర్‌లో ఉందని స్పీకర్‌ భావిస్తే వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు లోక్‌సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. నోటీసుల ఆమోదానికి సభలో తగు సంఖ్యా బలం ఉందని ఇప్పటికే నిరూపిత మైంది. కాబట్టి స్పీకర్‌ అనుమతిస్తే చర్చ జరగనుంది. తర్వాత ప్రధానమంత్రి సమాధానమిస్తారు.

మాట మార్చిన చంద్రబాబు
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అలుపెరుగని పోరాటం కొనసాగిస్తోంది. ఈ బడ్జెట్‌ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం గట్టిగా గళం విప్పుతారని, కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే పదవులకు రాజీనామాలు చేస్తారని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ పోరాటంలో తమతో కలిసి రావాలని అధికార తెలుగుదేశం పార్టీకి పిలుపునిచ్చారు.

తమ పార్టీ పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఒకవేళ టీడీపీ అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అవిశ్వాసం వల్ల ఒరిగేదేమీ ఉండదని తొలుత ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు ప్రత్యేక హోదా పోరాటం విషయంలో తాను వెనుకబడి పోతు న్నానని గ్రహించి, వైఎస్సార్‌సీపీ ఇచ్చే అవిశ్వాసం నోటీసుకు చాలినంత సంఖ్యా బలం లభిస్తే తానూ మద్దతిస్తానని చెప్పారు. తర్వాత ఒక్కరోజులోనే వైఖరిని మార్చుకుని తామే స్వయంగా అవిశ్వాసం నోటీసు ఇస్తామన్నారు.

గురువారం వైఎస్సార్‌సీపీ నోటీసును ఇవ్వగా, హడావుడిగా శుక్రవారం టీడీపీ నోటీసు ఇచ్చింది. సభ ఆర్డర్‌లో లేదంటూ స్పీకర్‌ ఈ రెండు నోటీసులను తోసిపుచ్చారు. తర్వాత వైఎస్సార్‌సీపీ మళ్లీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరి స్థిరంగా లేదని, ఎప్పటికప్పుడు మాట మారుస్తోందని, అందుకే తాము అవిశ్వాస తీర్మానం నోటీసు మళ్లీ ఇచ్చినట్లు వైఎస్సార్‌సీపీ చెబుతోంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఇచ్చిన రెండు నోటీసుల్లో స్పీకర్‌ దేన్ని పరిగణనలోకి తీసుకున్నా తాము దానికి మద్దతు సభలో లేచి నిలబడతామని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఇప్పటికే ప్రకటించారు. రాజకీయ ప్రయోజనాలు కాదని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చిచెప్పారు.  

మా నోటీసుకు మద్దతు లభిస్తుంది   – వైవీ సుబ్బారెడ్డి
తామిచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు ఇతర పార్టీల నుంచి తగినంత సంఖ్యాబలంతో మద్దతు లభిస్తుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చే విషయంలో తమ పార్టీయే ముందంజలో ఉందని, ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకోవడంలో కూడా తాము ముందున్నామని పేర్కొన్నారు.

తొలిసారి నోటీసు ఇచ్చినపుడే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు కోరుతూ రాజకీయ పార్టీలకు లేఖలు రాశారని గుర్తుచేశారు. తమకు మద్దతు ఇచ్చేందుకు చాలా పార్టీలు ముందుకొచ్చాయన్నారు. తాము తొలుత ఇచ్చిన నోటీసును శుక్రవారం లోక్‌సభలో తోసిపుచ్చినప్పటికీ తాము వెనుకడుగు వేయలేదని చెప్పారు.

Advertisement
Advertisement