పొలిటికల్‌ పిచ్‌ అచ్చా హై.. ఆట షురూ | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ పిచ్‌ అచ్చా హై.. ఆట షురూ

Published Fri, Apr 5 2019 9:32 AM

Olympic Athlets And Cricketers Contest in Lok Sabha Election - Sakshi

ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో ఇద్దరు మాజీ ఒలింపిక్స్‌ ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. రాజస్తాన్‌లోని జైపూర్‌ రూరల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున డిస్క్‌ త్రోయర్‌ కృష్ణ పునియా పోటీ చేస్తుండగా, బీజేపీ.. ప్రముఖ షూటర్‌ రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోర్‌ను నిలబెట్టింది. రాథోర్‌ ప్రస్తుతం కేంద్ర మంత్రి కూడా. పునియా సదల్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. కాగా, ఇటీవల బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ను న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన గౌతమ్‌.. అక్కడ గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల బరిలో దింపడంతో పాటు గౌతమ్‌ను స్టార్‌ ప్రచారకర్తగా కూడా ఉపయోగించుకోవాలని, న్యూస్‌ చానళ్లలో ఆయన ద్వారా ప్రచారం చేయించాలని కూడా కమలనాథులు ఆలోచిస్తున్నారు. గతంలో కూడా వివిధ క్రీడల్లో రాణించిన పలువురు క్రీడాకారులు రాజకీయాల్లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నించారు. వారిలో కొందరు పొలిటికల్‌ ప్లేగ్రౌండ్‌లో కూడా చెలరేగి విజేతలుగా నిలిస్తే మరి కొందరు ఒకటికి రెండుసార్లు ప్రయత్నించినా నెగ్గుకురాలేక ‘డకౌట్‌’ అయిపోయారు.

కీర్తి ఆజాద్‌ :  కాంగ్రెస్‌లోకి జంపింగ్‌
1973లో వరల్డ్‌ కప్‌ గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టులో ముఖ్యుడైన కీర్తి ఆజాద్‌ 1993లో ఢిల్లీ శాసనసభకు ఎన్నికయ్యారు. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి భగవత్‌ ఝా ఆజాద్‌ కుమారుడైన కీర్తి ఆజాద్‌ 1998లో బిహార్‌లోని దర్బంగా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో కూడా ఆయన దర్బంగా నుంచి నెగ్గారు. గత నెలలో ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.

సిద్ధూ :  హ్యాట్రిక్‌ వీరుడు
క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన సిద్ధూ ఇప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. దేశం తరఫున 50 టెస్ట్‌ మ్యాచ్‌లు, 100 వన్డేలు ఆడటమే కాక అంతర్జాతీయ క్రికెట్‌లో 7 వేల పరుగులు చేసి రికార్డు నెలకొల్పారు. సిద్ధూ తండ్రి భగవంత్‌ సింగ్‌ కూడా క్రికెటరే. ఆయన పాటియాలా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేశారు. సిద్ధూ తల్లి నిర్మల కూడా రెండుసార్లు కాంగ్రెస్‌ తరఫున అసెంబ్లీకి పోటీ చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక సిద్ధూ బీజేపీ తరఫున మూడుసార్లు (2004, 2007, 2009) అమృతసర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కొద్ది కాలం పాటు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. 2007లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధూ కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం పంజాబ్‌ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

మహ్మద్‌ అజహరుద్దీన్‌ :  ఒక గెలుపు.. ఒక ఓటమి
వరసగా మూడు వరల్డ్‌ కప్‌ పోటీల్లో ఆడిన భారత క్రికెటర్‌ అజహరుద్దీన్‌.. అప్పట్లో దేశంలోని గొప్ప క్రికెట్‌ కెప్టెన్లలో ఒకరిగా పేరొందారు. 2009లో ఆయన యూపీలోని మొరాదాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. 2014లో రాజస్తాన్‌లోని టాంక్‌ సవాయ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుఖ్‌బీర్‌ సింగ్‌ చేతిలో ఓడిపోయారు.

దిలీప్‌ తిర్కే :  తిరిగి వెనక్కే..
భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ అయిన దిలీప్‌ తిర్కే మూడు ఒలింపిక్స్‌ సహా 400కుపైగా అంతర్జాతీయ హాకీ పోటీల్లో పాల్గొన్నారు. ఆదివాసీ అయిన దిలీప్‌ 2012లో ఒడిశా నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014లో సుందర్‌గఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, బీజేడీ అభ్యర్థి జాల్‌ ఓరమ్‌ చేతిలో ఓడిపోయారు.

రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోర్‌ :  తప్పని గురి
లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించి 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో వెండి పతకం గెలుచుకున్న రాథోర్‌ సైన్యంలో పని చేసేవారు. 2013లో ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జైపూర్‌ రూరల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత సీపీ జోషిపై గెలిచారు. 2017లో మోదీ ప్రభుత్వంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా రాథోర్‌ జైపూర్‌ రూరల్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ప్రసూన్‌ బెనర్జీ :  ఫస్ట్‌ ‘పొలిటికల్‌ ఫుట్‌బాలర్‌’
భారత్‌ ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ప్రసూన్‌ బెనర్జీ పార్లమెంటులో అడుగుపెట్టిన మొట్టమొదటి ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు. ఆయన 2013లో హౌరా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్‌ తరఫున పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచారు.

జ్యోతిర్మయి సిక్‌దర్‌ :  అలుపెరగని పరుగు
పరుగుల రాణి అయిన జ్యోతిర్మయి దేశంలో గుర్తింపు పొందిన అథ్లెట్‌. 1998 ఆసియా క్రీడల్లో ఆమె రెండు బంగారు పతకాలు సాధించారు. 2004లో రాజకీయాల్లో చేరిన జ్యోతిర్మయి బెంగాల్‌లోని కృష్ణనగర్‌ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు.

పెవీలియన్‌కు చేరిన పాలిటిక్స్‌
మహ్మద్‌ కైఫ్‌ :  రన్నౌట్‌
మాజీ క్రికెటర్, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన కైఫ్‌ భారత క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించారు. అయితే, రాజకీయ మైదానంలో మాత్రం నెగ్గుకు రాలేకపోయారు. 2014లో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అదే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్‌ నుంచి పోటీ చేశారు. అయితే, బీజేపీ చేతిలో ఆయన ఓడిపోయారు. తర్వాత ఆయన రాజకీయాలను వదిలేశారు.

బాయిచుంగ్‌ భుటియా :  ‘గోల్‌’ పడలేదు
భారత ఫుట్‌బాల్‌ జట్టుకు పదేళ్ల పాటు కెప్టెన్‌గా ఉన్న భుటియా వంద మ్యాచ్‌లు ఆడారు. ఆయన నాయకత్వంలో భారత జట్టు మూడు సార్లు దక్షిణాసియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ కప్పు గెలుచుకుంది. 2014లో డార్జిలింగ్‌ నుంచి తృణమూల్‌ టికెట్‌పై పోటీ చేశారు. 2016లో సిలిగురి నుంచి బరిలో దిగారు. అయితే, రెండుసార్లూ ఆయన పరాజయం పాలయ్యారు. గతేడాది ఆయన హంరో సిక్కిం పార్టీ పేరుతో సొంత పార్టీ పెట్టారు. ఈ ఎన్నికల్లో ఆయన గ్యాంగ్‌టక్‌ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు.

ఎంఏకే పటౌడి:  రాజకీయాల్లో ‘అవుట్‌’
టైగర్‌ పటౌడీగా సుపరిచితులైన మన్‌సూర్‌ అలీఖాన్‌ పటౌడీ 21 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ అయ్యారు. 1971లో గుర్‌గావ్‌ నుంచి, 1991లో భోపాల్‌ నుంచి ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. రెండుసార్లూ కూడా విజయం సాధించలేకపోయారు.

కృష్ణ పునియా : ఓడిన చోటే గెలుపు
ప్రస్తుతం సదల్‌పూర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈమె 2013లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్‌ పోటీల్లో డిస్క్‌ త్రోలో బంగారు పతకం సాధించారు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో ఆరో స్థానంలో నిలిచారు. 2006లో దోహాలో జరిగిన ఆసియా క్రీడల్లో కంచు పతకం సాధించారు. 2013 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సదల్‌పూర్‌లో పోటీచేసి ఓడిపోయారు. ఐదేళ్ల తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచే గెలిచారు.

Advertisement
Advertisement