1.. 2.. మరో రెండు రోజులే | Sakshi
Sakshi News home page

1.. 2.. మరో రెండు రోజులే

Published Mon, Apr 8 2019 7:35 AM

Only Twodays For Political Parties Election Campaign Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. మంగళవారం సాయంత్రం 5గంటలకు ప్రచారపర్వం పరిసమాప్తం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం హోరాహోరీగా సాగుతుండగా ఆయా పార్టీలు మరింత జోరు పెంచే అవకాశముంది. ఎండలు మండుతున్నా లెక్క చేయకుండా అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, రోడ్‌ షోలు, బైక్‌ ర్యాలీలు, సభలు, సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. అభ్యర్థులకు మద్దతుగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కాలనీలు, బస్తీల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

అయితే ఈసారి గ్రేటర్‌లో అగ్రనేతల సభలు పెద్దగా ఏం జరగలేదు. నగరంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించినబహిరంగ సభకు సీఎం కేసీఆర్‌ హాజరు కాలేదు. నగరంలో మరో సభ నిర్వహించాలని గ్రేటర్‌ గులాబీ నేతలు భావించినప్పటికీ అది సాకారమయ్యేట్లు లేదు. అయితే ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాత్రం నగరంలో రోడ్‌ షోలు నిర్వహిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి సోమవారం వికారాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు.

రాహుల్‌ రాలేదు..  
కాంగ్రెస్‌ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ ప్రచారంలో మాత్రం అగ్ర నాయకత్వం కనిపించడం లేదు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన కేవలం చేవేళ్ల నియోజకవర్గానికి సంబంధించి  వికారాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభకే పరిమితమైంది. అదే నియోజకవర్గంలో జాతీయ నాయకుడు గులాంనబీ ఆజాద్, రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా పర్యటించారు. టీజేఎస్‌ నేత కోదండరామ్‌ సైతం అక్కడ ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో నగరంలో ఇక రాహుల్‌ పర్యటన లేనట్లే.  

కమలం జోష్‌..  
బీజేపీ అగ్రనేతలు నగరంలో సందడి చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ సైతం ఇక్కడ పర్యటించారు. కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షహనవాజ్‌ హుస్సేన్‌ సోమవారం హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇక ప్రచారానికి చివరి రోజైన మంగళవారం శంషాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పాల్గొననున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement