పతనంతిట్ట.. పాలనలో దిట్ట | Sakshi
Sakshi News home page

పతనంతిట్ట.. పాలనలో దిట్ట

Published Mon, Apr 1 2019 6:15 AM

Pathanamthitta Constituency Review on Lok Sabha Election - Sakshi

దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ‘పతనం తిట్ట’ది ప్రత్యేకమైన స్థానం. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతం పేరు వినని వారుండరంటే ఆశ్చర్యం కాదు. పశ్చిమ కనుమల అంచుల్లోని దక్షిణ కేరళలో ఉన్న పతనం తిట్ట శబరిమల వివాదం సందర్భంగా బాగా వెలుగులోకి వచ్చినప్పటికీ, అంతకు మించిన అంతర్జాతీయ ఖ్యాతి ఈ ప్రాంతం సొంతం చేసుకుంది. విద్య, వైద్యంలోనే కాదు, ప్రపంచమంతా బాలబాలికల నిష్పత్తిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి వెయ్యి మంది బాలురకి 1,129 మంది బాలికలతో సమానత్వ భావనకు తార్కాణంగా నిలిచింది. దేశంలోని మొత్తం 123 ప్రధాన నగరాల్లో ఈ ప్రాంతంలోని సెంట్రల్‌ ట్రావెన్‌కోర్‌ భారత వాయు స్వచ్ఛతకు కొలమానంగా భావిస్తారు. ప్రధానంగా మానవాభివృద్ధి సూచీలో ఈ ప్రాంతం అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడుతోంది. పతనంతిట్టలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన వారెవరికైనా.. ఆమర్త్యసేన్‌లాంటి వారు ఆరోగ్యం విషయంలో కేరళని మోడల్‌గా ప్రస్తావించడానికి కారణమేమిటో అర్థం అవుతుంది.

ఆరోగ్యంలో అగ్రగామి..
అభివృద్ధిలో ప్రధానంగా ఆరోగ్యరంగంలో పతనం తిట్ట అగ్రగామిగా ఉంది. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో ఇక్కడ ఈ విషయం చర్చనీయాంశం కాకపోవడం విచిత్రం. పతనం తిట్టలో శిశు ఆరోగ్యంలో ఉన్నతమైన ప్రమాణాలున్నాయని హార్వర్డ్‌ యూనివర్సిటీ, టాటా ట్రస్ట్‌ ఇటీవల లోక్‌సభ సెగ్మెంట్లలోని మానవాభివృద్ధి సూచీపై జరిపిన అధ్యయనం వెల్లడించింది. లోక్‌సభ సభ్యులను మరింత జవాబుదారీగా మార్చాలనే ఉద్దేశంతో జరిపిన ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. కమ్యూనిస్టుల కంచుకోటలో కాషాయజెండా ఎగురవేసేందుకు బీజేపీ శబరిమల విషయాన్ని సానుకూలంగా మార్చుకున్న నేపథ్యంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పతనం తిట్ట ప్రాధాన్యతను సంతరించుకుంది. శబరిమల అంశం తెరపైకి రావడంతో ఆరోగ్యం తదితర అంశాల్లో ఈ ప్రాంతం సాధించిన అభివృద్ధి సానుకూలత కూడా కొట్టుకుపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. శబరిమల అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రతిష్టాత్మక తీర్పుతో ఆరోగ్యాంశం ఈ ఎన్నికల్లో అంత ప్రాధాన్యతను సంతరించుకోలేకపోయింది.

క్రిస్టియన్‌ ఓటర్లే కీలకం..
ఈ ప్రాంతంలో క్రిస్టియన్‌ ఓటర్లదే కీలకపాత్ర. అందుకే ఇక్కడ అభ్యర్థుల ఎంపికలో సైతం మతం ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తోన్న క్రిస్టియన్‌ ఓటర్లు సీపీఎం వైపు ఉన్నారు. నిజానికి లౌకిక వాదాన్ని అనుసరిస్తూ, మైనారిటీల పక్షం వహిస్తే అది సీపీఎంకి అనుకూలిస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఈ విషయంలో సీపీఎం వైఖరి వేరుగా ఉండడం గమనార్హం. రోమన్‌ క్యాథలిక్‌ చర్చ్‌కి చెందిన ఆంటోనీ కాంగ్రెస్‌ నుంచి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆంటోనీ ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. మరోమారు ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే ఇదే వర్గానికి చెందిన ప్రముఖ టీవీ యాంకర్‌ వీణా జార్జ్‌ని ఈ స్థానం నుంచి సీపీఎం పోటీకి దింపింది. ఈ సనాతన చర్చ్‌కి వీణా జార్జ్‌ భర్త ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ కావడం, పతనం తిట్టలో ఆయన ప్రభావం ఎక్కువగా ఉండడంతో  సీపీఎం వీణా జార్జ్‌ని బరిలోకి దింపింది. వీణా జార్జ్‌ భర్త జార్జ్‌ 2016లో ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే శబరిమల అంశాన్ని అడ్డంపెట్టుకొని ఓట్లు దండుకోవాలని చూడొద్దని కేరళ ఎన్నికల కమిషనర్‌ టీకారాం నాయక్‌ హెచ్చరించడం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంది.

మొత్తం ఓటర్లు  13,40,193
మహిళా ఓటర్లు 6,98,718
అక్షరాస్యత 96.55%
ఎత్తుకు తగ్గ బరువులేని ఐదేళ్లలోపు బాలలు (జాతీయ సగటు 33 శాతం)12.5%
ప్రతి 3.95 కిలోమీటర్లకూ ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం
(జాతీయ సగటు ప్రకారం ప్రతి 7.3 కిలోమీటర్లకూ ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రం)
ప్రత్యేకించి ఈ ప్రాంతంలోని సెంట్రల్‌ ట్రావెన్‌ కోర్‌.. వాయు స్వచ్ఛతకు కొలమానంగా నిలుస్తోంది.

ఆయు ప్రమాణం  44 ఏళ్ల నుంచి 74 ఏళ్లకు పెరిగింది
వెయ్యి మందిబాలురకు బాలికలు 1,129

Advertisement
Advertisement