రాజ్యాంగానికి అతీతులుగా టీడీపీ ఎమ్మెల్యేలు!  | Sakshi
Sakshi News home page

రాజ్యాంగానికి అతీతులుగా టీడీపీ ఎమ్మెల్యేలు! 

Published Mon, Aug 13 2018 4:29 AM

Pawan Kalyan Fires On CM Chandrababu Govt - Sakshi

తణుకు టౌన్‌: రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి, చట్టానికి అతీతులుగా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి తణుకు నరేంద్ర సెంటర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తణుకులో స్వాతంత్య్ర సమరయోధుల ఇళ్లు శిథిలావస్థలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పవన్‌ ఆరోపించారు. టీడీపీకి జిల్లాలో 15 సీట్లకు 15 సీట్లను అప్పగిస్తే ఇక్కడి ఎమ్మెల్యేలు మాత్రం అధికారులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో ఏ గ్రామం చూసినా అస్తవ్యస్థ డంపింగ్‌ యార్డులతో మురుగు గుంతలు, మురుగుతో కంపుకొడుతున్నాయన్నాయని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం సదుపాయాలను కల్పించలేకపోతోందని విమర్శించారు. 

లోకేశ్‌కు మంత్రి ఉద్యోగం ఇచ్చారు
రాష్ట్రాన్ని మేమే అభివృద్ధి చేశామని సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌ చెప్పుకుంటున్నారు గాని, అందరి కృషితో సమష్టిగా చేశామనే మాట మాత్రం రావట్లేదని ఎద్దేవా చేశారు. లోకేశ్‌కు మంత్రి పదవి ఇచ్చి.. రాష్ట్ర యువతకు ఉద్యోగాలిచ్చినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గోదావరి పక్కనే ఉన్నా.. జిల్లాలో మంచి నీటి సమస్య ఎక్కువగా ఉందని, కలుషిత నీరే గ్రామీణులకు దిక్కయిందని పవన్‌ ధ్వజమెత్తారు. ప్రతి నియోజకవర్గంలో కోట్ల రూపాయల మంచినీటి వ్యాపారం జరుగుతోందని విమర్శించారు. తణుకు నియోజకవర్గంలో కనీస సదుపాయాలు కల్పించకపోయినా రూ. వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పుకుంటున్నారని, ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. టీడీపీ నాయకుల మాటలను బట్టి దోపిడీని టీడీపీ ప్రభుత్వం చట్టబద్ధం చేసిందని అర్థమవుతోందన్నారు.

కాపు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి
మహిళలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ అందించేలా, కాపు రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా తన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు తన మనవడి సంరక్షణ మాత్రమే చూస్తున్నాడని, తనను గెలిíపిస్తే రాష్ట్రంలోని ప్రతి చిన్నారిని సంరక్షించేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement