అవసరమైతే సాయుధ పోరాటం చేస్తా | Sakshi
Sakshi News home page

అవసరమైతే సాయుధ పోరాటం చేస్తా

Published Sat, Sep 29 2018 5:18 AM

Pawan kalyan Sensational Comments On TDP Leaders rowdyism - Sakshi

ఏలూరు రూరల్‌/సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ నాయకులు రౌడీయిజం, చిల్లర వేషాలు వేస్తే సహించం.. ఖబడ్దార్‌ అని జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. అవసరమైతే సాయుధ పోరాటం చేస్తానని, తన దాడిని ఊహించలేరని ఆయన పేర్కొన్నారు. అక్రమార్కులను, అవినీతిపరులను తరిమికొడతానన్నారు. శుక్రవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరులో పర్యటించారు. ఈ సందర్భంగా మొండికోడు రోడ్డుపై ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీపై విరుచుకుపడ్డారు. గురువారం రాత్రి తన బస వద్ద స్థానిక ఎమ్మెల్యే చింతమనేని మనుషులు చేసిన హడావుడిపై ఆయన స్పందిస్తూ.. ‘‘రాత్రి నా మీద దాడులకు వచ్చారు.

ఏ ఎమ్మెల్యేకి అయినా ఒకటే చెప్తున్నా.. నా మీద దాడికి వస్తే నేనేమైనా చేతులు ముడుచుకుని కూర్చున్నానా? నా సంగతి వాళ్లకి తెలీదు, నేను ఎంతటికైనా తెగిస్తాను, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తాం.. ఖబడ్దార్‌.. అంటూ హెచ్చరించారు. ‘‘గత ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు భుజం కాసినందుకే ఇప్పుడు భుజం నరికేస్తారా? వచ్చే ఎన్నికల్లో మరొకసారి వారిని గెలిపిస్తే స్వయంగా అందరి భుజాలను నరికేస్తారు..’’ అని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ పెద్దల దాడులకు గురౌతున్న పేదలు, మహిళలు, అధికారులకు జనసేన అండగా ఉంటుందన్నారు. మనపై దాడులకు సిద్ధపడుతున్నారంటే మనం బలపడుతున్నామని అర్థమంటూ జనసేన కార్యకర్తలకు ఆయన చెప్పారు.

కొల్లేరు సమస్య సున్నితమైంది
కొల్లేరు ప్రజల సమస్య సున్నితమైనదని పవన్‌ అన్నారు. గత ప్రభుత్వాలు ఆధిపత్యంకోసం కొల్లేరు సమస్యను ఉపయోగించుకున్నాయని, దీనిలో భాగంగానే టీడీపీ 120 జీవో తీసుకొచ్చిందని చెప్పారు. ఈ జీవోను అమలు చేయడం వల్ల వేలాదిమంది కొల్లేరు ప్రజలు కష్టాలు పడ్డారన్నారు.  పవన్‌ పరిసర కొల్లేరు ప్రాంతాన్ని పరిశీలించారు. కొల్లేరు నాయకుల ద్వారా లంకగ్రామాల ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. మొండికోడు సభకు స్థానిక లంక గ్రామాల ప్రజలు హాజరుకాలేదు. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఒత్తిడి చేయడం వల్లే కొల్లేరు గ్రామాల ప్రజలు పవన్‌ సభలో పాల్గొనలేదని కృష్ణా జిల్లాకు చెందిన కొల్లేరు నాయకులు చింతపల్లి వెంకటనారాయణ, రాష్ట్ర మత్స్యకారుల సంఘం మహిళా అధ్యక్షురాలు ఘంటసాల వెంకటలక్ష్మి, ఘంటసాల వెంకటేశ్వరరావు.. పవన్‌కల్యాణ్‌ సమక్షంలో ఆరోపించారు. అందువల్లనే గ్రామానికి దూరంగా కొల్లేరు రోడ్డుపై సభ చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు.

ఆధారాలు చూపండి.. చర్యలు తీసుకుంటాం
తనను చంపడానికి ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకున్న ఆడియోలు తన వద్ద ఉన్నాయని చెప్పిన జనసేన అ«ధినేత పవన్‌కల్యాణ్‌ ఆ ఆధారాలను పోలీసులకిస్తే చర్యలు తీసుకుంటామని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ అన్నారు. ఏలూరులో నిర్వహించిన సభలో పవన్‌ తనను హత్య చేయడానికి కుట్రపన్నారని ఆరోపించడం, గురువారం రాత్రి ఆయన బసచేసిన క్రాంతి కళ్యాణమండపం వద్ద చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు హల్‌చల్‌ చేయడంతో జనసేన అధినేతకు భద్రత పెంచారు. హడావిడి సృష్టించిన ఐదుగురును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement