ప్రజలు ఎక్కువ డబ్బు ఆశిస్తున్నారు | Sakshi
Sakshi News home page

ప్రజలు ఎక్కువ డబ్బు ఆశిస్తున్నారు

Published Sun, May 19 2019 3:59 AM

People expecting more money says Chandrababu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల ఎన్నికల్లో ధన ప్రవాహం అధికమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెద్ద నోట్లు రద్దు చేసి కొత్తగా రూ.500, రూ.2 వేల నోట్లను తీసుకురావడం వల్ల రాజకీయ నాయకులకు డబ్బులు పంచడం సులువైపోయిందని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా రూ.2 వేలు అంతకంటే ఎక్కువ ఆశిస్తున్నారని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను ముందుగానే వేయకుండా డబ్బు పెరుగుతుందని చివరి వరకు వేచి చూస్తున్నారని తెలిపారు. శనివారం ఢిల్లీలోని ఐఐసీలో  ‘దేశంలో ఎన్నికల విధానం– జవాబుదారీతనం’ అనే అంశంపై జరిగిన సదస్సులో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
శరద్‌ పవార్‌తో చంద్రబాబు మంతనాలు 

ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్, సిద్ధాంతాల అమలులో ఎన్నికల సంఘం విఫలమైందని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం, పారదర్శకత కలిగించాల్సిన ఈసీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, ఎన్నికల కోడ్‌ అమలు సహా అన్నింటిలోనూ విఫలమైందన్నారు. ఈసీ చర్యలను అన్ని పార్టీలు ఖండించాలని పిలుపునిచ్చారు.

రాహుల్‌తో చంద్రబాబు భేటీ
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో చంద్రబాబు శనివారం ఉదయం సమావేశమయ్యారు. సుమారు గంటపాటు జరిగిన వీరి భేటీలో ఎన్నికలు, పోలింగ్‌ సరళి, విపక్షాల సమావేశం ఏర్పాటుపై చర్చించినట్లు తెలిసింది. అనంతరం ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్, ఎల్‌జేడీ నేత శరద్‌ యాదవ్‌లతో సమావేశమయ్యారు. అంతకు ముందు ఉదయం ఏపీ భవన్‌లో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, ఎంపీ డి.రాజాతో భేటీ అయ్యారు. ఆ తరువాత లక్నో వెళ్లి బీఎస్పీ చీఫ్‌ మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌లను కలిశారు. 

Advertisement
Advertisement