Sakshi News home page

‘కుల రాజకీయాలు పని చేయలేదు’

Published Mon, Dec 18 2017 1:12 PM

People have rejected divisive politics of Congress, says yogi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై పలువురు కేంద్ర మంత్రులు, నేతలు స్పందించారు. గుజరాత్‌ ప్రజలు మరోసారి బీజేపీనే విశ్వసించారని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. నరేంద్ర మోదీ, అమిత్‌ షా వల్లే బీజేపీకి ఘన విజయం దక్కిందన్నారు. అభివృద్ధికే గుజరాత్‌ ప్రజలు పట్టం కట్టారని రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

కుల రాజకీయాలు పని చేయలేదు
పటీదార్‌ ఉద్యమనేతల ప్రభావం గుజరాత్‌ ఎన్నికలపై లేదని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. కాంగ్రెస్‌ కుల రాజకీయాలు ఎన్నికల్లో పని చేయలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు.

అభివృద్ధికే పెద్దపీట..
గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఇది సంతోషించదగ్గ పరిణామం అని, కార్యకర్తలు, ప్రజల విజయమని స్మృతి అభివర్ణించారు.

రాహుల్‌ పోరాటం అద్భుతం
ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పోరాటం అద్భుతమని శివసేన ప్రశంసలు కురిపించింది. ఎన్నికల ప్రచారానికి ప్రధాని, ముఖ్యమంత్రులు దూరంగా ఉండేలా చట్టం తీసుకురావాలని ఆ పార్టీ అభిప్రాయపడింది.

బీజేపీపై తీవ్ర ఆగ్రహం ఉంది
అధికార భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని ఎన్‌సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు. అయితే ఆ ప్రజాగ్రహాన్ని కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మలుచుకోలేక పోయిందని ఆయన అన్నారు.

బీజేపీ నాయకత్వం, కార‍్యకర్తల కృషి వల్లే..
కాంగ్రెస్‌ పార్టీ విభజన రాజకీయాలను ప్రజలు తోసిపుచ్చారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. బీజేపీ నాయకత్వం, కార్యకర్తల కృషి వల్లే గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో తమ పార్టీ గెలిచిందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement