హోదానే ఊపిరి.. జగనన్నే సారథి | Sakshi
Sakshi News home page

హోదానే ఊపిరి.. జగనన్నే సారథి

Published Fri, Mar 23 2018 1:34 AM

People protest with YS Jagan for AP Special Status - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘హోదానే ఊపిరి. దానిని సాధించడమే లక్ష్యం. అందుకోసం పోరాటం సాగిస్తున్న మీ వెంటే నడుస్తాం. మీ సంకల్పానికి అండగా నిలుస్తాం. అడుగులో అడుగులేస్తాం’ అంటూ యువతీ యువకులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, విద్యార్థులు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులో అడుగు వేశారు. అడుగడుగు నా ప్రత్యేక హోదా నినాదంతో హోరెత్తించారు. గురువారం చిలకలూరిపేట శివారు మొదలుకొని పోలిరెడ్డిపాలెం, వైఎస్సార్‌ కాలనీ, కొండ్రుపాడు, లింగంగుంట్ల, అప్పాపురం క్రాస్‌ మీదుగా కావూరు వరకు జగన్‌ 118వ రోజు ప్రజా సంకల్ప యాత్ర సాగింది. ఈ సందర్భంగా అడుగడుగునా ప్రత్యేక హోదా సెగ కనిపించింది. జనం తండోపతండాలుగా తరలివచ్చారు.

అభిమాన నేతను కలిసి, హోదా కోసం ఆయన చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు. అలుపెరగని పోరాటం చేస్తామని చెప్పారు. ‘వెన్ను చూపని మీ ఉద్యమమే భావితరాలకు శ్రీరామ రక్ష’ అంటూ నినదించారు. హోదా కోసం సాగే పోరులో విజయం సాధించాలని  వృద్ధులు, మహిళలు ఆశీర్వదించారు. ప్లకార్డులతో స్వాగతం పలికారు. మరోవైపు తాడిత పీడిత జనం సమస్యలను జననేత ఓపికగా విన్నారు. చెదిరిన గుండెల్లో ధైర్యం నింపారు. అంకిరెడ్డిపాలెం వద్దకు జగన్‌ రాగానే.. ప్రత్యేక హోదా కోసం జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తున్న ఉద్యమకారులు పరుగు పరుగున వచ్చారు.  

వారిని జననేత పలకరించారు. భావోద్వేగాలను తెలుసుకున్నారు. ‘అన్నా.. ప్రత్యేక హోదాను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. కోట్లాది మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కేసుల కోసం కేంద్రానికి అమ్ముడు పోయారు. మేం మీ వెంటే ఉంటాం. ఉద్యమిద్దాం. హోదా వచ్చే వరకూ  పోరాడుదాం’’ అంటూ ఆందోళనకారులు జగన్‌తో అన్నారు. హోదా ప్లకార్డును చేత పట్టుకుని జగన్‌ వారిలో మరింత ఉత్సాహం నింపారు.

Advertisement
Advertisement