నాలుగేళ్లుగా కష్టాలు, కన్నీళ్లే  | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లుగా కష్టాలు, కన్నీళ్లే 

Published Tue, Jun 5 2018 3:16 AM

People says there problems with YS Jagan At Tanuku - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘అన్నా.. నాలుగేళ్లుగా అన్నీ ఇక్కట్లే.. ఒక్క పనీ కావడం లేదు.. టీడీపీకి ఓటు వేయలేదంటూ అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారు.. అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు ఇవ్వడం లేదు.. ఎందుకిలా అని ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తూ దాడులకు దిగుతున్నారు’ అని వివిధ వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గుర్తింపు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పలువురు హమాలీలు గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 180వ రోజు సోమవారం వైఎస్‌ జగన్‌ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకుని తణుకు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. మార్గం మధ్యలో ‘సార్‌.. పౌర సరఫరాల(సివిల్‌ సప్లయ్‌) శాఖలో హమాలీలుగా పనిచేస్తున్న మాకు టీడీపీ పాలనలో గుర్తింపు లేకుండా పోయింది.

రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మంది హమాలీలం ఉన్నాం. మేమంతా చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. మీరు అధికారంలోకి రాగానే మమ్మల్ని నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందించాలి. హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలి’ అని హమాలీలు టి.కృష్ణంరాజు, కె.శివప్రసాద్, కె.విశ్వనాథ్, పి.వెంకటేశ్వరరావులు వినతిపత్రం అందించారు. ‘మీరు వైఎస్సార్‌ సీపీ అంటూ మా కుటుంబాలపై టీడీపీ వాళ్లు దౌర్జన్యం చేస్తున్నారు.. ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారు’ అని గొల్లగుంటపాలెంకు చెందిన కంచేటి లక్ష్మి, సీతామహాలక్ష్మి, లక్షమ్మ అనే మహిళలు జగన్‌తో సమస్యలు చెప్పుకున్నారు. తాము ఇళ్లు కట్టుకుంటుంటే అడ్డుపడి బెదిరిస్తున్నారని వాపోయారు. 

ఓ వైపు స్వాగతం.. మరో వైపు వినతులు 
జననేత జగన్‌.. తణుకు సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు జనం నుంచి విశేషమైన స్పందన లభించింది. తణుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ మహిళలు ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. పచ్చని పొలాలు, పల్లెల మీదుగా సాగిన పాదయాత్ర దారికి ఇరువైపులా నిలుచుని జనం నిరాజనాలు పలికారు. మార్గం మధ్యలో రోడ్డు పక్కన కొబ్బరి చెట్ల మీద నవరత్నాల పథకాలను వివరించడం ఆకట్టుకుంది. మహిళలు, అభిమానులు పార్టీ పతాకాలను చేతబట్టుకుని జగన్‌ వెంట నడిచారు. అయితంపూడి నుంచి ఏలేటిపాడు, ఒగిడి క్రాస్, గొల్లగుంటపాలెం, వేండ్రవారిపాలెం, ఇరగవరం, ఎర్రాయిచెరువు గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. పాదయాత్రకు సంఘీభావం ప్రకటిండానికి అసంఖ్యాకంగా తరలి వచ్చిన జనం.. మన కష్టాలు వినే నాయకుడు వచ్చారంటూ పలు వినతి పత్రాలు అందజేశారు. నాలుగేళ్లుగా దరఖాస్తు చేసుకుంటున్నా రేషన్‌కార్డు మంజూరు చేయలేదని అయితంపూడికి చెందిన షేక్‌ మస్తాన్‌ బీబీ ఆవేదన వ్యక్తం చేసింది.

తన ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడం లేదంటూ శీలం సుబ్బలక్ష్మీ అనే మహిళ గోడు వెళ్లబోసుకుంది. రైతుల రుణాలు మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మొత్తం రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారని రైతు కె.బాపిరెడ్డి, మరికొందరు మండిపడ్డారు. రెండేళ్లుగా తీవ్రమైన కాళ్ల వాపు వ్యాధితో బాధపడున్నా వైద్యం అందలేదని ఏలేటిపాడుకు చెందిన శాంతకుమారి కన్నీటిపర్యంతమైంది. పెద్ద ఎత్తున పెరిగిపోయిన ప్రభుత్వ అవినీతికి అడ్డుకట్ట వేయాలని చింతా అశ్రిత అనే మహిళ కోరింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక చదువుకోలేకలేకపోతున్నామంటూ పేకేరుకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని తన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. దేవ తెలుకుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఆ సంఘ ప్రతినిధులు కుకునూరి సత్యనారాయణ తదితరులు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ కేంద్రాల ద్వారా డ్వాక్రా సంఘాలకు రావాల్సిన కమీషన్లను జన్మభూమి కమిటీల పేరుతో మింగేశారని కత్తవపాడుకు చెందిన మహిళలు వాపోయారు. ఏడాదిగా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జననేత.. మన ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.   

వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక  
ఏలూరు టౌన్‌: టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు నేతలు సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కర్నూలు జిల్లాకు చెందిన డీసీసీబీ మాజీ డైరెక్టర్, కాంగ్రెస్‌ పార్టీ నేత ఆళ్లగడ్డ హరిసర్వోత్తమరావు, టీడీపీ నేత, పాములపాడు మాజీ ఎంపీపీ చెల్లె బాలేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్‌ బి.రఘురాంరెడ్డి, ఇతర నేతలు శివరామిరెడ్డి, నెమలి రఘురాంరెడ్డి, టి.చలమారెడ్డి, ఏ.రామేశ్వరరావుతోపాటు మరో 200 మంది నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరందరినీ వైఎస్‌ జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేత సింహాద్రి ఆశోక్‌ కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇదిలా ఉండగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పాదయాత్రలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ప్రజల కష్టాలన్నీ తీరుతాయన్నారు. ఎండనక, వాననక.. ఆరోగ్యం బాగోలేకున్నా పాదయాత్ర చేస్తున్న జగన్‌ను ప్రజలంతా నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారని చెప్పారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement