ఆత్మీయత తోడుగా.. | Sakshi
Sakshi News home page

ఆత్మీయత తోడుగా..

Published Mon, Feb 5 2018 7:21 AM

people support to ys jagan in praja sankalpa yatra - Sakshi

జననేత రాకతో పల్లెలు పులకించాయి. అడుగడుగునా ఆత్మీయ స్వాగతాలు పలికాయి. మహిళలు మంగళ హారతులిచ్చి, దిష్టితీసి గుమ్మడికాయలు కొట్టి మరీ పల్లెలోకి స్వాగతించారు. అశేష జనాభిమానం పాదయాత్రలో జననేత వెంట అడుగులు వేస్తూ ముందుకు సాగారు. వెల్లువెత్తిన ప్రజాభిమానం నడుమ జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: ఓవైపు  పల్లెల్లో ఆత్మీయ స్వాగతాలు, మరోవైపు పల్లెప్రజల కడగండ్లను, సాధక బాధలను వింటూ వారిలో మనో ధైర్యం నింపుతూ జననేత జగన్‌మోహన్‌ రెడ్డి ఆదివారం ప్రజాసంకల్పయాత్ర  కొనసాగించారు. మరోవైపు విద్యార్థులు మొదలుకుని కులసంఘాల నేతల వరకు యాత్రకు తరలివచ్చి జననేతకు సంఘీభావం పలికారు. తమ పక్షాన ప్రభుత్వంపై మీరే పోరాడాలన్నా అంటూ వినతులు వెల్లువులా ఇచ్చారు. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతి ఒక్కరి సమస్యను క్షుణ్ణంగా వింటూ వారికి భరోసా కల్పించారు.

యాత్ర సాగిందిలా..
ప్రజాసంకల్పయాత్రలో 79వ రోజైన ఆదివారం నెల్లూరు రూరల్‌ మండలంలోని సౌత్‌మోపూరులో ప్రారంభమై దేవరపాళెంలో ముగిసింది. మొత్తం 12.6కి.మీ పాదయాత్ర సాగింది. ఇంకోవైపు ఆర్యవైశ్యుల ఆత్మీయ సదస్సులో జననేత ప్రసంగించారు. సోమవారం నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో యాత్ర ముగిసి కోవూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

ఆదివారం ఉదయం సౌత్‌మోపూరులోని గిరిజన కాలనీ నుం చి యాత్ర ప్రారంభం కాగానే పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జననేతకు స్వాగతం పలికారు. ఈసందర్భంగా అక్కడ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ నేతలు కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం ములుముడి చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి ఆత్మీయ అతిథిని అక్కున చేర్చుకున్నారు.  ఈ సందర్భంగా అక్కడ పద్మావతి, వెంకయ్య దంపతులు జననేతను కలిసి భావోద్వేగానికి లోనయ్యారు. దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ చలువతో తన కుమారుడు ప్రణవ్‌కుమార్‌కు గుండె ఆపరేషన్‌ చేయించామని, ఆయన దయతో కుమారుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని విన్నవించారు. ముక్తియార్‌ అనే మహిళ తన కుమారుడు జహంగీర్‌కు రెండు కిడ్నీలు పాడయ్యాయని ఆవేదన వ్యక్తంచేసింది. అనంతరం అక్కడ డాక్యుమెంట్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు సురేష్‌కుమార్‌తో కలిసి కొందరు జననేత వద్దకు వచ్చి తమ సమస్యలను విన్నవించారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం వల్ల డాక్యుమెంట్‌ రైటర్లు జీవనభృతిని కోల్పోతున్నారని మీరే న్యాయం చేయాలన్నా అంటూ విన్నవించారు.

ములుముడిలో పార్టీ పతాకాన్ని జననేత ఆవిష్కరించారు. అనంతరం ఎపీ వైఎస్‌ఆర్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వాసు, బి.రఘురామిరెడ్డి విపక్ష నేతను కలిసి సీపీఎన్‌ విధానాన్ని రద్దుచేసి పాతపెన్షన్‌ విధానాన్ని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. అనంతరం అక్కడే వైఎస్‌ఆర్‌ సేవాదళ్‌ తమిళనాడు విభాగం సభ్యులు లక్ష్మీశ్రీదేవి రెడ్డి నేతృత్వంలో కొందరు కలిసి యాత్రకు సంఘీభావం తెలిపారు. స్పందన క్రాస్‌రోడ్డులో స్థానికులు, అనంతరం కొమ్మరపూడి క్రాస్‌రోడ్డులో మహిళలు ఘనస్వాగతం పలికారు. నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు కుడుముల రవి నేతృత్వంలో న్యాయవాదులు జననేతను కలిసి వినతిపత్రం అందజేశారు.

అక్కడ నుంచి దేవరపాళెం చేరుకున్న జగన్‌మోహన్‌ రెడ్డికి గ్రామస్తులు, ఆర్యవైశ్య సంఘ యువత అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ నగర డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాధ్‌ ఏర్పాటు చేసిన  ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో జననేత ప్రసంగించారు. ఈసందర్భంగా ఆర్యవైశ్యులు  ఘనంగా సత్కరించారు. అక్కడ నుంచి బయలుదేరిన జగన్‌మోహన్‌రెడ్డికి దేవరపాళెం ప్రాంత వాసులు స్వాగతం పలికారు. ఈక్రమంలో వంగపూడి పెంచలయ్య అనే రైతు జననేత ఎదుట తన గోడును వెలిబుచ్చుకున్నారు. దివంగత వైఎస్‌ఆర్‌ హయాంలో ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరైనా నేటికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం అక్కడే ఏపీ రజక సంఘం నేతలు చదలవాడ రామయ్యతో పాటు పలువురు జననేతను కలిసి తమను ఎస్సీల్లో చేర్చాలని వినతిపత్రం సమర్పించారు.

ముఖ్య నేతలు హజరు
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థనరెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాసంక   ల్పయాత్ర కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసులు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పి.రూప్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement