ప్రభంజనం | Sakshi
Sakshi News home page

ప్రభంజనం

Published Mon, Feb 19 2018 6:24 AM

 people support to ys jagan in praja sankalpa yatra - Sakshi

ఎటు చూసినా జనం..జనంజననేతకు వెన్నంటినఅభిమాన ప్రభంజనంఅధికారపు ఆంక్షల సంకెళ్లు తెంచుకుని..వేధింపుల కుట్రలను ఛేదించుకుని..కదలి వచ్చిన జన తరంగం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో మూడో రోజు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్‌ను చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. వచ్చిన జనాన్ని ఆయన పలకరించారు. అభిమాన నేతను చూసి ఉద్వేగానికి గురైన జనం మా కష్టాలు, కన్నీళ్లు తుడిచే నువ్వే కాబోయే సీఎం అంటూ  ఆశీర్వదించారు. జిల్లాలో మూడో రోజు నూకవరం నుంచి ప్రారంభమైన యాత్ర బడేవారిపాలెం, అత్తింటివారిపాలెం, బొంతవారిపాలెం, కాకుటూరు, చెర్లోపాలెం మీదుగా మధ్యాహ్నానికి ప్రశాంత్‌నగర్‌కు చేరింది. భోజన విరామం అనంతరం మొదలైన యాత్ర సాయంత్రానికి కందుకూరుకు చేరుకుంది. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు కందుకూరులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ పాల్గొన్నారు. మూడవ రోజు వైఎస్‌ జగన్‌ 12.6 కి.మీ. మేర నడిచారు. పాదయాత్రలో బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, తూమాటి మాధవరావు తదితరులు జగన్‌ వెంట నడిచారు. 

వైఎస్‌ జగన్‌కు సమస్యల ఏకరువు: ప్రజాసంకల్ప యాత్రలో దారి పొడవునా వైఎస్‌ జగన్‌కు జనం సమస్యలు ఏకరువు పెట్టారు.
బడేవారిపాలెంకు చెందిన లింగాబత్తిన సురేష్‌ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. వారానికి రెండు సార్లు డయాలసిస్‌ చేయాల్సి రావడంతో మందులకు నెలకు రూ.6 వేలు ఖర్చవుతుందని జగన్‌ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం పింఛన్‌ కూడా ఇవ్వడం లేదని దీంతో ఇబ్బందులు పడుతున్నానని వాపోయారు.
ఆధార్, రేషన్‌ కార్డుల్లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బడేవారిపాలేనికి చెందిన ఎస్టీలు జగన్‌ దృష్టికి తెచ్చారు.
పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ అనంతసాగరానికి చెందిన కూరగాయల రైతులు వైఎస్‌ జగన్‌        మోహన్‌రెడ్డికి విన్నవించారు.
కందుకూరు మున్సిపాలిటీలో కాంట్రాక్టు వర్కర్లుగా పని చేస్తున్న తమను తొలగించి రోడ్డున పడేశారని బాధిత కుటుంబాలు జగన్‌మోహన్‌ రెడ్డి ఎదుట మొరపెట్టుకున్నారు.
సీపీఎస్‌ విధానాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రద్దు చేస్తామని చెప్పడంతో హర్షం వ్యక్తం చేస్తూ కందుకూరు డివిజన్‌ ఏపీ సీపీఎస్‌ఈఏ ఆయన్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
కొండాపురం గ్రామానికి చెందిన సంగా సుబ్బారావు గొర్రెపిల్లను వైఎస్‌ జగన్‌కు బహూకరించారు. బడేవారిపాలెం గ్రామానికి చెందిన రైతులు నాగలిని బహుమతిగా ఇచ్చారు.  
ఆర్టీసీ నేషనల్‌ మజ్దూర్‌ యూని యన్‌ వారు జగన్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ప్రజా రవాణాను ప్రభుత్వ బాధ్యతగా భావించి నష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వమే నిర్వహించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కందుకూరు వారు జగన్‌ని కలిసి వినతిపత్రం సమర్పించారు.
సర్వశిక్షా అభియన్‌ విభాగంలో 12 సంవత్సరాలుగా పని చేస్తున్న తమను రెగ్యులర్‌ చేయాలని కాంట్రాక్టు డేటా ఎంట్రీ ఆపరేటర్లు యాత్రలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి జగన్‌ పాదయాత్ర   మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చూపించేందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారని ప్రజలు ఆశీర్వదిస్తే దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి మించిన అభివృద్ధి సంక్షేమ పాలన అందిస్తాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కందుకూరు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌తో కలిసి బాలినేని పాల్గొని ప్రసంగించారు. జగన్‌ వజ్రసంకల్పంతో యాత్ర సాగిస్తున్నాడన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు సర్కారు నెరవేర్చలేదన్నారు. కందుకూరులో జగన్‌ సభకు తండోపతండాలుగా జనం తరలివచ్చి విజయవంతం చేసినందుకు బాలినేని కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వంచించాడు : నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
చంద్రబాబు రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించాడని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం కందుకూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల సమయంలో దుగరాజపట్నం, కడప ఉక్కు కర్మాగారం, విశాఖకు రైల్వే జోన్‌ అంటూ పలు హామీలు కురిపించిన బీజేపీ, టీడీపీ గద్దెనెక్కాక వాటిని తుంగలో తొక్కారన్నారు. రాజకీయ ప్రయోజనాలకు ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. నరేంద్రమోదీ గ్రాఫ్‌ తగ్గిందని భావించే చంద్రబాబు కొత్త నాటకాలకు తెరలేపారన్నారు. 175 అసెంబ్లీ సీట్లను 275కు పెంచుకునేందుకు చూపిన శ్రద్ధ హోదా కోసం శ్రమించి ఉంటే హోదా వచ్చేదన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ పోరాడారన్నారు.  హోదా ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని జగన్‌ ఎప్పుడో ప్రకటించారన్నారు. ఏప్రిల్‌ 6న ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో ఆదరణ పెరగడంతోనే బాబు ఎత్తులు వేస్తున్నారని, బాబు ఎత్తులను ప్రజలు తిప్పి కొడతారని మేకపాటి చెప్పారు. కేంద్రం దుగరాజపట్నం లేదని చెప్పినందున రామాయపట్నం పోర్టునైనా ఇవ్వాలన్నారు.  జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రాళ్లపాడు ప్రాజెక్టుతో ఈ ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తాడన్నారు.

రైతుల గోడు పట్టని సర్కారు :కందుకూరు సమన్వయకర్త తూమాటి మాధవరావు
చంద్రబాబు ప్రభుత్వం రైతుల గోడు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌ సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు విమర్శించారు. వరుస కరువులతో నియోజకవర్గంలో 60 వేల మంది వలస పోయారన్నారు. సోమశిల ఉత్తర కాలువను పూర్తి చేస్తే వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చి న వెంటనే ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. కందుకూరులో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందన్నారు. రామాయపట్నం పోర్టు వచ్చి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ఇవన్నీ జరగాలంటే జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్‌ హయాంలో వేల ఇళ్లు నిర్మిస్తే చంద్రబాబు హయాంలో ఒక్క ఇల్లు నిర్మించలేదని విమర్శించారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిస్తే కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు లక్షలాది మందిని వంచించారని విమర్శించారు.  

కిక్కిరిసిన కందుకూరు.. జగన్‌ సభ విజయవంతం
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ జనంతో కిక్కిరిసిపోయింది. సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. కందుకూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఉలవపాడు, వలేటివారిపాలెం, లింగసముద్రం, గుడ్లూరు, కందుకూరు మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు సభకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్‌ను చూసేందుకు, ప్రసంగం వినేందుకు అన్ని వర్గాల వారు తరలిరావడం గమనార్హం. సాయంత్రం గం.4.22కు వైఎస్‌ జగన్‌ ప్రసంగం ప్రారంభం కాగా..కొద్ది సేపటి తరువాత  పక్కనే ఉన్న మసీదు నుంచి అసర్‌ అజా వినిపించడంతో ముస్లింల సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపుతున్నట్లు జగన్‌ ప్రకటించారు. అజా ముగిసిన తరువాత ప్రసంగం కొనసాగించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు మూడు రోజుల పాదయాత్రతో పాటు జగన్‌ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించారు. గంటసేపు సాగిన జగన్‌ ప్రసంగం జనాన్ని ఉత్తేజితులను చేసింది. చంద్రబాబు సర్కారుపై జగన్‌ చేసిన విమర్శలకు అడుగడుగునా జనం ఈలలు, కేకలతో స్పందించారు. చంద్రబాబు సంక్షేమ పథకాల్లో ఇస్తున్న కొర్రీలను జగన్‌ జనాలకు కళ్లకు కట్టినట్లు వివరించారు.   కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, గిద్దలూరు సమన్వయకర్త ఐ.వి.రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి, వెంకటగిరి సమన్వయకర్త మేరిగ మురళితో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement