రైతులకు అండగా జగనన్న | Sakshi
Sakshi News home page

రైతులకు అండగా జగనన్న

Published Thu, Apr 12 2018 7:33 AM

People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

మంగళగిరిరూరల్‌: టీడీపీ ప్రభుత్వం రాజధాని కోసం రైతులను బెది రించి, వారి భూములు బలవంతంగా లాక్కుం దని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. రాజధాని రైతులు భయపడాల్సిన అవసరం లేదని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ పరిధి ఉండవల్లి సెంటర్‌లో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో ఎమ్మల్యే ఆర్కే మాట్లాడారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో రైతులను రాజుగా చూశారని గుర్తుచేశారు. చంద్రబాబు జీవితం వెన్నుపోటు పొడిచే జీవితమని, అది ఎప్పటికీ మారదని, తన అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే ఫండ్‌ అనేదే ఇవ్వకుండా వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను అన్యాయం చేస్తూ అభివృద్ధిని అడ్డుకొంటుందీ ఈ ప్రభుత్వమేనని విమర్శించారు. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను ప్రభుత్వం బలవంతంగా తొలగిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్నారని దుయ్యబట్టారు. పేదలకొక న్యాయం, సీఎంకొక న్యాయమా అని ప్రశ్నించారు. కోర్టు రెండుసార్లు తీర్పు ఇచ్చినా ఆయనకేమాత్రం బుద్ధిరాలేదని ఎద్దేవాచేశారు.

జగనన్నతోనే సుస్థిర పరిపాలన
ప్రస్తుత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, జగనన్న రాకతోనే సుస్థిర పరి పాలన సాధ్యమవుతుం దని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి దూరమై తొమ్మిదేళ్లు గడిచినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నాయన్నారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో తిరిగి రాజన్న పాలనను తీసుకొస్తారని హామీ ఇచ్చారు. 600కు పైగా హామీలతో 2014లో గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం వాటిని నెరవేర్చకపోగా ప్రజలను నిలువునా మోసం చేసిందని దుయ్యబట్టారు. రుణమాఫీలో 10వ వంతు కూడా చెయ్యలేదని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగావకాశాలు లేకుండా చేసింది టీడీపీ ప్రభుత్వమే అని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు కదలలేదని, విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ 9 నెలల్లో పూర్తిచేస్తామని చెప్పారని, ఇప్పటికి మూడు సంవత్సరాలు గడిచినా పూర్తవలేదని, ఇదేనా చంద్రబాబు అభివృద్ధి అంటే అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement