క్షీరపురి.. జనభేరి | Sakshi
Sakshi News home page

క్షీరపురి.. జనభేరి

Published Sat, Jun 2 2018 7:50 AM

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

క్షీరపురిలో జనభేరి మోగింది. వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం పాలకొల్లు నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగింది. సాయంత్రం పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో జరిగిన బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. కావాలి జగన్‌.. రావాలి జగన్‌ అంటూ నినదించారు. 

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి ,ఏలూరు: జననేత.. ప్రజాహృదయ విజేత.. వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి పాలకొల్లు పట్టణం బ్రహ్మరథం పట్టింది. అడుగడుగునా నీరాజనాలు పలికింది. ప్రజలు ఆయనను కలవాలని, ఆయనతో మాట్లాడాలని తపించారు. ఆయన అడుగులో అడుగేశారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా పాలకొల్లులో శుక్రవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. రోడ్లన్నీ కిక్కిరిశాయి. వై.ఎస్‌.జగన్‌ పాదయాత్రగా  పట్టణంలోకి వస్తుంటే ప్రజలంతా ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం ఆయనను అనుసరించారు.

హర్షధ్వానాలతో ఆమోదం
బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన పాలకొల్లు నాటక, సినీరంగాలకు పుట్టినిల్లని కొనియాడారు. ఇలాంటి ప్రాంతంలో వ్యవసాయం పండగలా ఉండేదని, ఇప్పుడు దండగలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. డెల్టాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రెండో పంటకు నీరందని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి  హయాంలో ప్రారంభించిన డెల్టా ఆధునికీకరణ పనులు ఇప్పటికీ పూర్తికాలేదనీ, అధికార పార్టీ నేతలకు కమీషన్లు ఇస్తేనే పనులు ముందుకు సాగే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. సర్కారు అవినీతి, అక్రమాలపై వైఎస్‌ జగన్‌ తనదైన శైలిలో ధ్వజమెత్తుతుంటే చప్పట్లు, ఈలలు, హర్షధ్వానాలతో ప్రజలు ఆమోదం తెలిపారు.

అవినీతి ఎమ్మెల్యే
స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అవినీతికి మారుపేరుగా మారారని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పుష్కరాల కోసం పాలకొల్లు చుట్టుపక్కల రూ.350 కోట్లతో చేసిన పనులన్నీ నాసిరకంగా జరిగాయని విమర్శించారు. ఇక్కడ ఇసుకనూ దోచేస్తున్నారని, స్థానిక గాంధీబొమ్మల సెంటర్‌లో ఇసుక లారీలను నిలబెట్టి మరీ అమ్మేస్తున్నా.. కలెక్టర్, అధికారులు పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. వనం–మనం పేరుతో ధనయజ్ఞం జరుగుతోందని, ఒక్కో మొక్కకూ ట్రీగార్డుల పేరుతో వ్యాపారుల నుంచి రూ.వెయ్యి వసూలు చేసి.. మొక్కలు కొన్నట్లు చూపి, ప్రభుత్వం నుంచీ బిల్లులు పొందారని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. 

యాత్ర సాగిందిలా..
శుక్రవారం ఉదయం  నరసాపురం పట్టణ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. చిట్టవరం క్రాస్‌ మీదుగా పాలకొల్లులోకి ప్రవేశించింది. అక్కడ పాలకొల్లు నాయకులు ఎదురేగి జననేతకు ఘనస్వాగతం పలికారు.

అడుగడుగునా వినతులు
పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు జననేతకు సమస్యలు విన్నవించారు. ‘మా సమస్యలు మీతోనే పరిష్కారమవుతాయి’ అంటూ జగనన్నపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.  ప్రభుత్వ ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేయాలని కడపకు చెందిన యోగివేమన యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు వై.వెంకటసుబ్బయ్య, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి నరసాపురంలో వైఎస్‌ జగన్‌ను కలిసి విన్నవించారు. పెంకిలపాడు సమీపంలోని కొత్తపేట గ్రామంలో 500 కుటుంబాలు నివసిస్తున్నాయని, ఇక్కడ మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని ఆ గ్రామస్తులు వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. అధికారంలోకి వచ్చాక 40 ఏళ్లు దాటిన ప్రతి చేనేత కార్మికుడికీ పింఛను సదుపాయం కల్పించాలని, ప్రతి కుటుంబానికీ  35 కిలోల బియ్యాన్ని  ఇవ్వాలని కర్ణభక్తుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు.  యలమంచిలి మండలం ఊటాడ గ్రామానికి చెందిన రామేశ్వరపు లక్ష్మి, మాజీ సర్పంచ్‌ శాంతి స్వరూపిణి చిట్టవరం క్రాస్‌ వద్ద జననేతను కలిశారు. 2008లో ఆరోగ్యశ్రీ పథకంలో గుండెకు ఆపరేషన్‌ చేయించుకున్నానని లక్ష్మి వైఎస్‌ జగన్‌కు వివరించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ క్షేమ సమాచారం కోరుతూ రాసిన లేఖను వైఎస్సార్, జగన్‌ ఫోటోలతో కలిపి లామినేషన్‌ చేయించి ఫ్రేంను ఆయనకు అందజేశారు.

  2002లో చంద్రబాబు హయాంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు ఇచ్చినా.. ఇప్పటికీ స్థలాలు అప్పగించలేదని నరసాపురం మండలం రుస్తుంబాద వీవర్స్‌కాలనీకి చెందిన తిప్పా లక్ష్మి చిట్టవరం క్రాస్‌ రోడ్డు వద్ద వైఎస్‌ జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాఠశాలల్లో 2006 నుంచి పనిచేస్తున్న ఐఈఆర్‌టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రిసోర్స్‌ టీచర్స్‌ యూనియన్‌ నాయకులు జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో 653 ఎస్సీ హాస్టళ్లను ఎత్తివేయడం వల్ల దళిత విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని దళిత స్టూడెంట్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ రాష్ట్ర నాయకులు, పెనుగొండకు చెందిన ముప్పిడి మోషే చిట్టవరం క్రాస్‌ వద్ద వైఎస్‌ జగన్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు.  పెదగరువు గ్రామానికి చెందిన గూటాల చిట్టిరాజు తనకు గుండె ఆపరేషన్‌ జరిగిందని, సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే తెలుగుదేశం సభ్యత్వ కార్డు కావాలని అడుగుతున్నారని జననేతకు ఫిర్యాదు చేశాడు. సీతారామపురానికి చెందిన మేరీ కేజిమ్‌ తనకు  పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చినా పోస్టింగ్‌ ఇవ్వడంలేదని, డీజీపీకి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వైఎస్‌ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

తరలివచ్చిన శ్రేణులు
పాదయాత్రలో జిల్లా పరిశీలకులు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఏలూరు పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ళనాని, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, పాలకొల్లు సమన్వయకర్త గుణ్ణం నాగబాబు, ఆచంట సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, తణుకు సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు,  పోలవరం సమన్వయకర్త తెల్లం బాలరాజు, కొవ్వూరు సమన్వయకర్త తానేటి వనిత, గోపాలపురం సమన్వయకర్త తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, రైతు విభాగం రాష్ట్ర అ«ధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పార్టీ నాయకులు గాదిరాజు సుబ్బరాజు, రాజీవ్‌ కృష్ణ,  వందనపు సాయిబాలపద్మ,  గూడూరి ఉమాబాల, గుబ్బల తమ్మయ్య, మేడిది జాన్సన్, పీడీ రాజు, యడ్ల తాతాజీ, చింతమనేని  శ్రీనివాస్‌ అనంత్,  కమ్మ శివరామకృష్ణ, పి. గౌతంరెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement