మా జిల్లా ప్రజల్ని ఆదుకోండి: మాజీ మంత్రి

2 Jun, 2019 15:40 IST|Sakshi
పైడికొండల మాణిక్యాల రావు

తాడేపల్లిగూడెం: గత తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసిన ఈ జిల్లా ప్రజలను ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడికొండల మాణికాల్య రావు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాణిక్యాల రావు మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పశ్చిమ యువత వలసబాట పడుతున్నారని, వారిని కొత్త ప్రభుత్వం ఆదుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని ఆ దిశగా అడుగులు వేస్తూ బెల్ట్‌షాపుల రద్దుకు కృషి చేస్తోన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు అని చెప్పారు.

ఈ జిల్లాలో పూర్తికాని తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు అనుమతినిచ్చిన పాత, కొత్త ప్రభుత్వాలకు ధన్యవాదాలన్నారు. తాడేపల్లిగూడెంలో మెడికల్‌ కాలేజీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో బాటుగా విమానాశ్రయ భూముల్లో నివాస పట్టాలు పంపిణీ కొత్త ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు