దొంగే.. దొంగదొంగ అన్న చందంగా.. | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీపై ఎదురుదాడి

Published Thu, Mar 7 2019 8:07 AM

Police Arrest to YSRCP Leaders in West Godavari - Sakshi

దొంగతనంగా వైఎస్సార్‌ సీపీ ఓట్లు తొలగించేందుకు చేసిన కుట్రబట్టబయలు కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఓట్లతొలగింపునకు వైఎస్సార్‌ సీపీని బాధ్యులను చేస్తూ నియోజకవర్గాల్లో ధర్నాలకు దిగుతున్నారు. మరోవైపు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి వైఎస్సార్‌ సీపీ బూత్‌  కన్వీనర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.  

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి,ఏలూరు: ఓట్ల తొలగింపు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  వైఎస్సార్‌సీపీకి చెందిన బూత్‌ కన్వీనర్లను, ముఖ్య కార్యకర్తలను పోలీస్‌ స్టేషన్లకు పిలిపిస్తున్నారు. వారి వద్ద స్టేట్మెంట్లు నమోదుచేసి బుధవారం జిల్లా ఎస్పీ దగ్గరికి తీసుకువెళ్లే యత్నం చేశారు. అనేక  గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీ సభ్యుల ప్రమేయం లేకుండా వారి పేర్లు, ఫొటోలతో వైఎస్సార్‌ సీపీకి చెందిన ఓటర్ల ఓటును తొలగించేలా ఆన్‌లైన్‌లో  అధికార పార్టీ నాయకులే దొంగ దరఖాస్తులు పెట్టారు.  ఆఖరికి ఒక బూత్‌ కన్వీనర్‌ తన ఓటుతోపాటు తన తమ్ముడి ఓటు కూడా తొలగించాలని దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలుగుదేశం వారే దరఖాస్తు చేసేశారు.  గోపాలపురం నియోజకవర్గం ప్రకాశరావుపాలెంకు చెందిన గుడిశెట్టి వెంకటశివన్నారాయణ వైఎస్సార్‌ సీపీ బూత్‌ కన్వీనర్‌గా పనిచేస్తున్నాడు. అతని పేరుతోనే అతని ఓటు అతని తమ్ముడి ఓటు తొలగించాల్సిందిగా ఫారం–7 అందింది. ఇది అధికారపార్టీ పనేనని శివన్నారాయణ ఆరోపిస్తున్నారు.

యలమంచిలిలో ధర్నా
యలమంచిలిలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ పొత్తూరి బుచ్చిరాజు నాయకత్వం లో పార్టీ నేతలు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం ధర్నా చేశారు.మోసపూరితంగా తమ పేరుతో ఆన్‌లైన్‌ దరఖాస్తులు పెట్టారని పిర్యాదు చేస్తే విచారణ చేసి నిందితులను పట్టుకోవడం మాని విచారణ పేరిట అర్థరాత్రి పోలీసులు ఇళ్లకు రావడం ఏమిటని బుచ్చిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వందల మందిని స్టేషన్లకు
ఏలూరు మండలం నుంచి 205 మందిని విచారణ నిమిత్తం ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వివరాలు సేకరించారు.  దరఖాస్తులు మీరే చేశారా లేదా అని ప్రశ్నించారు. తమ పేరు, ఫోటోతో ఎవరో దరఖాస్తు చేశారని, తమకు సంబంధం లేదని నాయకులు చెప్పారు.
పెదవేగి నుంచి 185 మందిని పిలిపించారు.
ఆచంటలో బూత్‌ కన్వీనర్లను ఏలూరు ఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. తమ పేరుతో తప్పుడు దరఖాస్తులు చేశారని, తాము ఫిర్యాదు చేస్తే దానిపై విచారణ జరపకుండా తమనే పోలీసు స్టేషన్లకు పిలవడం ఏంటని వారు ప్రశ్నించారు.
చింతలపూడిలో పలువుర్ని విచారణ పేరుతో  పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఈ వ్యవహారంతో తమ పార్టీకి సంబంధం లేదని, పోలీసులు సమగ్ర దర్యాప్తు  జరిపించాలని ఎస్సై, సీఐ, అసిస్టెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు వైఎస్సార్‌సీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
వీరవాసరం మండలంలో బూత్‌ కన్వీనర్లను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం తిరిగి పంపించారు. భీమవరం తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు తీసుకువెళ్ళి, తిరిగి పంపించివేశారు.  
కొవ్వూరు మండలం వేములూరు నుంచి నలుగురు బూత్‌ కన్వీనర్లను తీసుకువెళ్ళారు.  ఏలూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకు వెళ్ళాలని నిడదవోలు వరకు తీసుకు వెళ్ళి మళ్ళీ తిరిగి పంపించివేశారు.
నిడదవోలు మండలం కోరుమామిడి, తాడిమళ్ళ గ్రామాలకు చెందిన ఆరుగురు బూత్‌ కమిటీ సభ్యులను సీఐ ముందు హాజరు పరిచారు.
దేవరపల్లి, గోపాలపురం, నలజర్ల, ద్వారకాతిరుమల మండలాల్లోని దాదాపు 80 గ్రామాల్లో టీడీపీ నాయకులు ఓట్ల తొలగింపునకు వైఎస్సార్‌ సీపీ నాయకుల పేర్లమీద ఓట్లు తొలగించాలంటూ ఫారం–7లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేశారు. ఓట్లు తొలగించాలంటూ  ఆన్‌లైన్‌ లో ఫారం–7 ద్వారా వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్లు, పార్టీ నేతల పేర్ల మీద నకిలీ దరఖాస్తులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు, బూత్‌ కన్వీనర్లు ధర్మాజిగూడెం ఎస్సై రాంబాబుకు బుధవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు 15 మంది పార్టీ నేతలు, బూత్‌ కన్వీనర్లను స్టేషన్‌కు రప్పించుకుని వారి వద్ద నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు.   
పాలకొల్లులో నలుగురు కమిటీ సభ్యులను విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు.
తణుకు పట్టణంలోని ఏడుగురు బూత్‌ కమిటీ కన్వీనర్లను, మండలంలోని నలుగురిని విచారణ నిమిత్తం తీసుకువెళ్ళారు. తరువాత పంపించివేశారు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్‌ స్టేషన్‌కి వైఎస్సార్‌ సీపీ బూత్‌ కన్వీనర్ల మేనేజర్‌ కర్రి భాస్కరరావు, గొర్రెల శ్రీనివాస్, కర్రి సుధాకర్‌రెడ్డిలను పిలిపించారు. ఎస్పీ తీసుకురమ్మన్నారు. మీరంతా అమరావతికి రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తర్వాత వారితో మాట్లాడి పంపించేశారు.
ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల్లో బూత్‌  కమిటీ కన్వీనర్లను సుమారు 40 మందిని ఆయా పోలీస్‌స్టేషన్లకు తీసుకువెళ్లి విచారణ చేశారు.  అనంతరం విడిచిపెట్టారు.  

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిటీడీపీ జెండాలతో ధర్నాలు
మరోవైపు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా పార్టీ జెండాలు పట్టుకుని జిల్లాలో పలుచోట్ల తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. గోపాలపురంలో రాస్తారోకో చేసిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, అతని అనుచరులపై కేసులు నమోదు చేయాలంటూ వైఎస్సార్‌ సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వేధింపులు
‘మీరు ఓట్లు తొలగింపునకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పెట్టారు. మీరు రేపు ఉదయం ఏడు గంటలకు పోలీస్‌ స్టేషన్‌కు రావాలి’ అంటూ అన్ని పోలీస్‌ స్టేషన్ల నుంచి వైఎస్సార్‌ సీపీ బూత్‌ కన్వీనర్లకు పిలుపువచ్చింది. కొన్నిచోట్ల మంగళవారం అర్ధరాత్రి 11 గంటల నుంచి బుధవారం ఉదయం వరకూ పోలీసులు ఆయా కన్వీనర్ల ఇళ్లకు వెళ్లి హడావుడి చేశారు. చాలాచోట్ల ఇప్పటికే వైఎస్సార్‌ సీపీ నేతలు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తమ ప్రమేయం లేకుండానే అన్‌లైన్‌లో ఈ దరఖాస్తులు వచ్చాయని, దీనిపై విచారణ జరపాలని కోరారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఫిర్యాదు చేసిన వారినే స్టేషన్లకు రప్పించడం వివాదాస్పదంగా మారింది. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని, అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్లను భయపెట్టే యత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement