కన్నడ బరిలో మఠాధిపతులు...! | Sakshi
Sakshi News home page

కన్నడ బరిలో మఠాధిపతులు...!

Published Tue, Apr 3 2018 8:57 AM

Political Parties Offering Tickets To Religious Seers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కర్ణాటకలో  పలువురు  మఠాధిపతులు ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కాషాయాంబరధారులైన ఈ మఠాధిపతులు ఇంత పెద్ద సంఖ్యలో పోటీ చేసేందుకు సమాయత్తం కావడం ఆ రాష్ట్రంలో ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. బ్రాహ్మణేతర  గోరఖ్‌నాథ్‌ మఠం అధిపతిగా ఉన్న యోగి ఆదిత్యానాథ్‌ తొలుత ఎంపీగా ఆ తర్వాతి ఉత్తరప్రదేశ్‌ సీఎంగా కీలక బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వీరంతా కూడా ఆయననే ఆదర్శంగా తీసుకుని  ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

వచ్చే నెల 12న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీకి నలుగురు మఠాధిపతులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆయన పనితీరును వారు ప్రశంసిస్తున్నారు. వీరంతా కూడా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని నలుగురు మంత్రులపై పోటీకి సై అంటున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, అంతకు ముందు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పలు మఠాలను సందర్శించారు. ఈ సందర్భంగానే వివిధ మఠాధిపతులను తమ పార్టీ పక్షాన పోటీ చేయించేందుకు బీజేపీ నాయకులు సిద్ధపడుతున్నట్టు వార్తలొచ్చాయి. 

ఎవరీ మఠాధిపతులు..?
ఎన్నికల రంగంలోకి దిగేందుకు ఉత్సాహాన్ని చూపుతున్న వారిలో ఉడుపిలోని ఓ మఠానికి చెందిన లక్ష్మీవార తీర్థస్వామి, ధార్వాడ్‌ మఠానికి చెందిన  బసవానంద స్వామి, చిత్రదుర్గలోని మఠానికి చెందిన మదర చెన్నయ్యస్వామి, దక్షిణ కన్నడలోని ఓ మఠానికి చెందిన రాజశేఖరానంద స్వామి ఉన్నారు. వీరిలో శ్రీ గురు బసవ మహామనే మఠాధిపతి బసవానంద స్వామికి దృష్టిలోపముంది. లింగాయత్‌ మఠానికి చెందిన బసవానంద కాలాఘటగి నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర కార్మికమంత్రి, మైనింగ్‌ అధిపతి సంతోష్‌లాడ్‌పై పోటీకి సిద్ధమంటున్నారు.

2013లోనే ఆయన బీజేపీలో చేరిన హాసన్‌ లోక్‌సభ నుంచి మాజీ ప్రధాని, జేడీ(ఎస్‌) అధినేత హేచ్‌డీ దేవెగౌడపై పోటీ చేయాలని కోరుకున్నారు. అయితే పార్టీ ఆయనకు టికెటివ్వలేదు. ఉడుపి మఠాలు ఎనిమిదింటిలో ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న  షిరూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న  లక్ష్మీవర తీర్థస్వామి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పక్షంలో ఈ మఠాల నుంచి పోటీ చేసిన తొలివ్యక్తిగా నిలుస్తారు. అయితే ఎన్నికల బరిలోకి దిగాలన్న ఆయన నిర్ణయం పట్ల సీనియర్‌ మఠాధిపతి విశ్వేష తీర్థస్వామి మొదలుకుని ఇతర మఠాధిపతులు అసంతృప్తితో ఉన్నారు. మత్స్యశాఖ మంత్రి ప్రమోద్‌ మధ్వరాజ్‌పై పోటీ చేయాలని లక్ష్మీవర తీర్థస్వామి భావిస్తున్నారు.

వివాదస్పద ప్రసంగాలకు ప్రసిద్దుడైన మంగళూరుకు సమీపంలోని వజ్రదేహి మఠానికి చెందిన రాజశేఖరానంద స్వామి భజరంగ్‌దళ్, వీహేచ్‌పీ, ఇతర మితవాద గ్రూపులతో సంబంధాలున్నాయి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అటవీశాఖ మంత్రిగా ఉన్న  రామనాథ్‌ రాయ్‌పై పోటీ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. చిత్రదుర్గ జిల్లాలోని శ్రీశివ శరణ మదర గురు పీఠానికి చెందిన మదర చెన్నయ్య స్వామి బీజేపీ టికెట్‌ ఆశిస్తున్న వారిలో ఒకరనే ప్రచారం జరుగుతోంది. దళిత వర్గంలో మంచి ఆదరణ ఉన్న ఆయనకు మాజీ సీఎం యెడ్యూరప్ప, సీనియర్‌ నేత కేఎస్‌ ఈశ్వరప్పల సన్నిహితుడిగా పేరుంది.

ఎన్నికల్లో పోటీకి సంబంధించి చెన్నయ్యస్వామి బహిరంగ ప్రకటనేది చేయలేదు. ఇటీవల ఈ మఠాన్ని అమిత్‌ షా సందర్శించడంతో హోలాల్‌ఖేరే రిజర్వ్‌ స్థానం నుంచి ఆయన పోటీ చేయవవచ్చునని భావిస్తున్నారు.  ప్రస్తుతం ఈ స్థానానికి  సాంఘిక సంక్షేమశాఖ మంత్రి హెచ్‌. ఆంజనేయ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనితో పాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ చెన్నయ్యస్వామిని బీజేపీ బరిలోకి దింపవచ్చుననే వార్తలొచ్చాయి. 

ఈ జాబితాలో మరికొందరు...
ఈ నలుగురు మఠాధిపతుల పేర్లతో పాటు మరికొందరు కూడా జేడీ(ఎస్‌)  తరఫున లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచనతో ఇటీవలే పరమానంద రామరుధస్వామి జెడీ (ఎస్‌) పార్టీలో చేరారు. బాగల్‌కోట్‌ జిల్లాలోని బిలాగి నియోజకవర్గం నుంచి ఆయన టికెట్‌ ఆశిస్తున్నారు. కల్బుర్ఘి జిల్లాలోని జేవార్గి నుంచి పోటీకి అందోలలోని కరుణేశ్వర మఠాధిపతి, శ్రీరామ్‌సేన అధ్యక్షుడు సిద్ధలింగ స్వామి ప్రణాళికలు సిద్ధం చేశారు. సామాజికసేవకే  జీవితాన్ని అంకితం చేసిన ఫాదర్‌ జాకబ్‌ పల్లిపురతి 1983లో కల్‌ఘట్గి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించారు. అయితే కర్ణాటకలో  మతపెద్దలు, మఠాధిపతులుగా ఉన్నవారు ఎన్నికల్లో గెలిచిన ఉదంతాలు చాలా తక్కువే.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

Advertisement
Advertisement