బాబోయ్ పులి | Sakshi
Sakshi News home page

బాబోయ్ పులి

Published Thu, Mar 28 2019 9:08 AM

Political SetiricalStory of Lok Sabha Election - Sakshi

అనగనగా ఓ ముసలి పులి. సొంతంగా ఆహారం సంపాదించుకునే శక్తి లేదు. నిత్యం ఏవో గిమ్మిక్కులు చేసి, ఏమార్చి ఎవరో ఒక బాటసారిని పొట్టన పెట్టుకునేది. (అచ్చం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలా అన్నమాట.. ఈయన సొంతంగా ఏనాడూ ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు.. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని, గెలిచాక ఆ పార్టీపై బండలేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసినట్లు.) ఇలాంటి పులికి ఓ రోజు ఓ బంగారు కడియం దొరికింది. (చంద్రబాబుకు సీఎం పదవి దక్కినట్లు) దాంతో బాటసారులను మోసం చేయడానికి ఆ ముసలి పులికి ఓ క్రూర ఆలోచన వచ్చింది.. ఆ బంగారు కడియాన్ని ఆశ చూపి, బాటసారులను తినేయాలని కుట్ర పన్నింది. (అవి ఇస్తాం.. ఇవి ఇస్తాం.. అని చంద్రబాబు అలవిగాని హామీలిచ్చి, అవి నెరవేర్చకుండా ప్రజల ఓట్లు దండుకున్నట్లు) ఇందులో భాగంగా ఆ దారిన వెళ్తున్న వారితో ‘అయ్యా.. నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది.. పేదవాడిలా కనిపిస్తున్నావ్‌..

ఇదో నా వద్ద ఉన్న బంగారు కడియం నీకు ఇవ్వాలనుకుంటున్నాను.. నన్ను చూసి భయపడొద్దు.. నేను ముసలిదాన్నయిపోయాను.. కదల్లేను.. ఇది వరకు కూడా చాలా మందికి చాలా సాయం చేశాను.. ఈ చివరి రోజుల్లో కూడా ఓ మంచి పని చేయాలనుంది’ అని చెప్పేది. (సెల్‌ఫోన్‌ నేనే తెచ్చాను.. కంప్యూటర్‌ నేనే తెచ్చాను.. హైదరాబాద్‌ నేనే కట్టాను.. ఎయిర్‌ పోర్ట్, రింగురోడ్డు నేనే కట్టాను.. సింధూకు బాడ్మింటన్‌ ఆడటం నేనే నేర్పించాను.. అమరావతిలో ఒలంపిక్స్‌ నిర్వహిద్దామనుకుంటున్నాను.. అని మన ముఖ్యమంత్రి చెబుతున్నట్లు) ‘అయినా నువ్వు పులివి.. నీ మాటలు ఎలా నమ్మాలి?’ అని బాటసారులు ప్రశ్నించే వారు.. ‘అదా మీ సందేహం.. ఇదో ఈ బంగారు కడియాన్ని ఇక్కడే పెట్టేసి నేను పాక్కుంటూ పక్కకు వెళ్లిపోతాను.. మీరు ఈ పక్కనున్న బావిలో స్నానం చేసి పవిత్రంగా వచ్చి ఈ బంగారు కడియం తీసుకెళ్చొచ్చు’ అని చెప్పేది. (మీరు బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారం మీ ఇంటికి రావాలంటే బాబుకు ఓటెయ్యాలి అని 2014లో రైతులు, డ్వాక్రా మహిళలకు చంద్రబాబు చెప్పినట్లు) ఆ ముసలి పులి మాటలు నమ్మిన బాటసారులు బంగారు కడియం కోసం స్నానం చేసి వద్దామని బావిలోకి దిగేవారు. (చంద్రబాబు మాటలు నమ్మి ఏపీ ప్రజలు ఆయనకు ఓటేసినట్లు) ఆ బావిలో బురద ఎక్కువగా ఉండటంతో కూరుకుపోయి ఇబ్బంది పడుతుండగా పులి వెళ్లి తినేసేది. మరుసటి రోజు మళ్లీ మామూలే. ఆ బాటన వెళ్లే వారికి బంగారు కడియం చూపించి తన పని కానిచ్చేది. (2014లో ఇచ్చిన హామీలే నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజల జీవితాలను దుర్భరం చేసింది కాక, ఇప్పుడు ‘పుసుపు–కుంకుమ’ అంటూ చంద్రబాబు మహిళలను నమ్మిస్తున్నట్లు.)                – ఎలక్షన్‌ డెస్క్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement