ఝూటా ఖాన్‌దాన్‌: పొన్నం | Sakshi
Sakshi News home page

ఝూటా ఖాన్‌దాన్‌: పొన్నం

Published Sat, Sep 29 2018 1:38 AM

Ponnam prabhakar commented over kcr family - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫ్యామిలీ అంతా అబద్ధాల కోరు అని, దేవుడు వారికి ఎవరినైనా నమ్మించి మోసం చేసే కళ ఇచ్చాడని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. అబద్ధాల పునాదుల మీద కోటలు కడతారని, వారిని కల్వకుంట్లకు బదులుగా అబద్ధాల చంద్రశేఖర్‌రావు, అబద్ధాల కేటీఆర్, కవితలని పిలవాలని పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రభుత్వం కాంగ్రెస్‌ నేతలపై అక్రమ అరెస్టులు, దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు, నాలుగున్నరేళ్ల పాలనలో లాభపడింది కేవలం కేసీఆర్‌ కుటుంబమేనని, టీఆర్‌ఎస్‌ పార్టీకి దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఆయన సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలనే కాకుండా జిల్లా, మండల స్థాయి నేతల్ని కూడా కేసుల పేరుతో వేధిస్తోందని మండిపడ్డారు.

ఇటీవల జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కసి పెరిగిందని, నియంతృత్వ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా అందరూ పని చేస్తున్నారని చెప్పారు. రోజురోజుకూ కాంగ్రెస్‌కు ప్రజాదరణ పెరుగుతుండటం చూసి బెంబేలెత్తిన కేసీఆర్‌.. ముందస్తు ఎన్నికల కు వచ్చారని విమర్శించారు. లేదంటే సరైన కారణం ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వానికి తొత్తుగా గవర్నర్‌  
రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని పొన్నం ఆరోపించారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా, ప్రభుత్వ ప్రచారశాఖ మంత్రికి తీసిపోని విధంగా వ్యవహరిస్తున్న ఆయన.. ఒకసారి ప్రజలు ఏమనుకుంటున్నారో ఇంటెలిజెన్స్‌ ద్వారా నివేదికలు తెప్పించుకుంటే అర్థమవుతోందని చెప్పారు. జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రేవంత్‌రెడ్డిలపై జరుగుతున్న దాడులన్నీ కక్ష పూరితమని, ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున, అధికార పార్టీ ఆగడాలను అరికట్టాలని ఆయన అధికారులను కోరారు. శాంతిభద్రతలకు భంగం కలగితే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలే బాధ్యత వహించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పోరాటం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య కాదని, తెలంగాణ ప్రజలు, టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య అని పొన్నం వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో విసిగి, వేసారిన ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ, కూటమిలకు మద్దతు పలుకుతారని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయకుండా ఓట్లడగమని చెప్పిన కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతారని ప్రశ్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement