ఏపీ పరిస్థితి ఊహాతీతం : కేఏ పాల్‌ | Sakshi
Sakshi News home page

ఏపీ పరిస్థితి ఊహాతీతం : కేఏ పాల్‌

Published Tue, Dec 25 2018 4:34 PM

Praja Shanthi Party KA Paul Slams Chandra babu In Delhi - Sakshi

ఢిల్లీ: ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూస్తుంటే ఊహాతీతంగా ఉందని, అన్నింటిలో  తామే నంబర్‌ వన్‌ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని  ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్‌ కేఏ పాల్‌ విమర్శించారు. క్రైమ్‌లో ఏపీ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కేఏ పాల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులకు రక్షణ కరువయిందన్నారు. ఏపీలో రోడ్లు, ఆసుపత్రుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, ప్రజలకు సరైన ఆహారం అందుబాటులో లేదని చెప్పారు. రాష్ట్రంలో రైతుల  ఆత్మహత్యలు పెరిగిపోయాయని, నిరుద్యోగుల సంఖ్య కూడా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలో శాంతి ఎక్కడుందని బాబును సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన చుట్టూ ఉన్న వాళ్లు మాత్రమే బాగుపడ్డారని అన్నారు. ఏపీ ప్రజలు ఏ రంగంలోనూ లాభపడలేదని వివరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేస్తున్నదని తెలిపారు. డిసెంబర్‌ 29న విశాఖపట్నంలో ప్రజాశాంతి పార్టీ ఆఫీసుని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రజాశాంతి పార్టీలో చేరుదామని ఉత్సాహం ఉన్న వాళ్లు వైజాగ్‌ రావాలని కోరారు. 13 జిల్లాల్లో బూత్‌ లెవెల్‌ కమిటీ చర్చ జరుగుతుందని చెప్పారు.

మా ఒక్క​ పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాల పార్టీ అని, మిగతా పార్టీలు కుటుంబ పార్టీలు, కుల పార్టీలు  అని తీవ్రంగా ధ్వజమెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇద్దరు ముఖ్యమంత్రులు వివాదాలు సృష్టించి నేను గొప్ప నేను గొప్ప అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. థర్డ్‌ ఫ్రంట్‌లోని పెద్ద నాయకులు నన్ను ప్రేత్యేకంగా కలుస్తున్నారని వెల్లడించారు. సేవ్‌ సెక్యులర్‌ ఇండియా అనే నినాదమే నా నినాదమని ఆయన చెప్పారు. చివరిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement