ఢిల్లీలో రాహుల్‌ ఇఫ్తార్‌ విందు | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో రాహుల్‌ ఇఫ్తార్‌ విందు

Published Thu, Jun 14 2018 1:52 AM

Pranab Mukherjee attends Rahul Gandhis Iftar party - Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష నేతలకు బుధవారం ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో నిర్వహించిన ఈ విందుకు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హాజరయ్యారు. వీరితోపాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే నేత కనిమొళి, జేడీఎస్‌ నేత డానిష్‌ అలీ, జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌ యాదవ్, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత దినేశ్‌ త్రివేది, బీఎస్పీ నేత సతీశ్‌చంద్ర మిశ్రా, ఆర్జేడీ నాయకుడు మనోజ్‌ ఝా, ఎన్సీపీ నేత డీపీ త్రిపాఠి, జార్ఖండ్‌ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్‌ సోరెన్‌ హాజరయ్యారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు వేదికగా మారనుందని భావిస్తున్న ఈ విందుకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్, తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీలు చివరి నిమిషంలో గైర్హాజరయ్యారు.

ప్రధాని వీడియో నవ్వించేలా ఉంది
ప్రధాని మోదీ ట్వీటర్‌లో పోస్ట్‌ చేసిన ఫిట్‌నెస్‌ వీడియోపై రాహుల్‌ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. అది వింతగా, నవ్వించేలా ఉందన్నారు. బుధవారం ఇఫ్తార్‌ వేడుకలో మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌తో టేబుల్‌ పంచుకున్న రాహుల్‌..సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వైపు తిరిగి ‘మోదీకి దీటుగా మీరూ ఫిట్‌నెస్‌ వీడియోను పోస్ట్‌ చేయొచ్చుగా!’ అని అన్నారు. అక్కడే ఉన్న కనిమొళి, దినేశ్‌ త్రివేది, బీఎస్పీ నాయకుడు సతీశ్‌ చంద్ర మిశ్రాలు ప్రధాని వీడియో గురించి విని నవ్వుకున్నారు.   

మహా కూటమి.. ప్రజల ఆకాంక్ష
మోదీ,బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలతో ఏర్పాటయ్యే మహా కూటమి ప్రజల ఆకాంక్ష అని రాహుల్‌ గాంధీ ముంబైలో విలేకరులతో అన్నారు. ‘మహా కూటమి ఏర్పాటు బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీల కోసం మాత్రమే కాదు. అది ప్రజల ఆకాంక్ష. మహాకూటమితోనే ప్రధాని, బీజేపీ, ఆరెస్సెస్‌ లను ఎదుర్కోగలం’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement