Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో పుతిన్‌కు గట్టి పోటీ?

Published Thu, Oct 19 2017 10:37 AM

Putin's Mentor Daughter in Next Presidential Elections

మాస్కో : మూడుసార్లు రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వ్లాదిమిర్‌ పుతిన్‌కు వచ్చే ఎన్నికల్లో పోటీ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రష్యా పారిస్‌ హిల్టన్‌గా అభివర్ణించే నటి సెనియా సోబ్చక్‌  అధ్యక్ష ఎన్నికల బరిలో దిగబోతుందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. 

35 ఏళ్ల సెనియా నటి, టీవీ యాంకర్‌, జర్నలిస్ట్‌గానే అక్కడి ప్రజలకు సుపరిచితం. అయితే అన్నింటికి మించి ఆంటలోయ్‌ సోబ్చక్‌ కూతురు ఆమె. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ మొదటి మేయర్‌ అయిన ఆంటలోయ్‌ పుతిన్‌ రాజకీయ గురువు కూడా. పుతిన్‌ కోసం ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన సమయంలోనే ఆయన అనుమానాదాస్పద స్థితిలో చనిపోయారు. ప్రస్తుతం అక్కడ పుతిన్‌ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. వీటిలో ఆమె క్రియాశీలంగా పాల్గొంటున్నారు. అయితే తాను ఉద్యమకారిణిగానే ఇందులో పాల్గొంటున్నానని సెనియా చెబుతున్నప్పటికీ.. విశ్లేషకులు మాత్రం ఆమె ఖచ్చితంగా పోటీ చేసి తీరుతుందని అంచనా వేస్తున్నారు. 

కాగా, గతేడాది స్థానిక ఎన్నికల్లో పుతిన్‌ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. దీంతో పుతిన్ అనుకూల వర్గీయులందరూ 2018లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలల్లో కూడా ఆయనే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, సెనియా పోటీకి దిగితే మాత్రం పుతిన్‌ నాలుగోసారి గెలవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement